చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశ్వనటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పేరిట పార్టీ పెట్టి….ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు.
ఈ క్రమంలోనే రజనీ కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారని అభిమానులు అంతా ఆశించారు. అయితే ఈ ఎన్నికల్లో అభిమానులను నిరాశ పరిచినా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి సిద్ధమవుతారని తెలుస్తోంది.
చదవండి: ‘‘అద్వానీ అలా చేయకపోతే.. మోడీ పని అప్పుడే అయిపోయేది..’’
2021 నాటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, అప్పటి వరకు ఆయన సినిమాలతో బిజీగా ఉంటారని రజనీ సోదరుడు సత్యనారాయణరావు స్పష్టం చేశారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక ఈ ప్రకటనతో తలైవా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. కాగా, రజనీ ప్రస్తుతం నయనతారతో కలిసి దర్బార్ సినిమా చేస్తున్నారు.
ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా 2020 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.








