24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రఫేల్ పత్రాలు పోయాయి, చర్యలు తీసుకుంటాం: సుప్రీంకు చెప్పిన కేంద్రం

రఫేల్ పత్రాలు పోయాయి, చర్యలు తీసుకుంటాం: సుప్రీంకు చెప్పిన కేంద్రం

- Advertisement -

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై సమీక్షించరాదన్న వైఖరిని కేంద్రం మరోసారి పునరుద్ఘాటించింది. రక్షణ శాఖ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. చోరీ చేసిన వారిపై చట్టపరంగా చర్య తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది.

రఫేల్ ఒప్పంద వార్తలను ప్రచురించినందుకు ది హిందూ వార్తా పత్రికపై అధికార రహస్యాల చట్టం కింద చర్య తీసుకుంటామని స్పష్టం చేసింది.

పత్రాల చోరీకి పాల్పడిన వారిపై చర్యలు

రఫేల్ పత్రాలను బహిరంగపరిచిన వారు అధికార రహస్యాల చట్టం, కోర్టు ధిక్కరణ కింద దోషులవుతారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. పత్రాల చోరీకి పాల్పడిన వారిపై తీసుకున్న చర్యల విషయమై గురువారం ఒక నివేదికను సమర్పిస్తామన్నారు.

రఫేల్ ఒప్పందం విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

రఫేల్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కొట్టివేయాలని సుప్రీంకోర్టు డిసెంబర్ 14న నిర్ణయించినప్పుడు కేం ద్రం కొన్ని కీలక విషయాలను తొక్కిపెట్టిందని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూష ణ్ సంయుక్తంగా పిటిషన్ వేశారు.

కాగా, ‘‘రక్షణశాఖ నుంచి రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు చోరీకి గురయ్యాయి. సరిగ్గా వాటిలోని వివరాల ఆధారంగానే రామ్‌ కథనాలున్నాయి. పైగా ఫిబ్రవరి 8, మార్చి 6 సంచికల్లో రఫేల్‌ విషయమై ఆయన రాసిన కథనాలు న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసేలా ఉన్నాయి. తద్వారా కోర్టు ధిక్కరణకూ పాల్పడ్డారు..’’

‘‘భూషణ్‌ వాదనలు కూడా తస్కరణకు గురైన డాక్యుమెంట్ల ఆధారం ఉన్నాయి. రక్షణ కొనుగోళ్ల వ్యవహారం న్యాయ సమీక్షకు అతీతమైంది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలు ఇటీవల మనపై దాడి చేశాయి. వాటిని మిగ్‌ విమానాలు దీటుగా ఎదురించాయి. కానీ ప్రభావవంతంగా ఎదురుదాడి చేయడానికి రఫేల్‌ విమానాల అవసరం చాలా ఉంది..’’ అని వేణుగోపాల్‌ తెలిపారు.

ఆసక్తికర వాదనలు

పత్రాలు చోరీపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించగా… ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని ఏజీ బదులిచ్చారు. ధర్మాసనం ఏజీకి చిక్కు ప్రశ్నలు సంధిస్తుండటంతో వాదనలు వేడెక్కాయి.

చోరీకి గురైన పత్రాలను ఆధారం చేసుకుని పిటిషనర్లు తీర్పును సమీక్షించాలని కోరుతున్నందున వారి పిటిషన్‌లను కొట్టివేయాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు.

ఇందుకు ధర్మాసనం కలుగజేసుకుని…‘‘పిటిషనర్లు సందేహాస్పద మార్గాల్లో దస్త్రాలను పొందారని మీరంటున్నారు. ఆ పత్రాలు అంటరానివని, వాటిని న్యాయస్థానం ముట్టుకోకూడదని ఎలా చెబుతారు? కేసుకు అనుగుణంగా ఆ పత్రాలున్నప్పుడు న్యాయస్థానం వాటిని పరిశీలించకుండా ఎలా ఉంటుంది? బోఫోర్స్‌ కుంభకోణం కేసులో కూడా పత్రాలను ఇలాగే పరిశీలించవద్దంటారా? మనకిక్కడ పారదర్శక వ్యవస్థ ఉంది..’’ అని పేర్కొంది.

ఇందుకు అడ్వకేట్ జనరల్ బదులిస్తూ- ‘‘అవును. మనకు పారదర్శకమైన వ్యవస్థ ఉంది. అందుకే ఏ దేశంలోనూ లేని విధంగా.. ఏదో పరిపాలన అంశమైనట్టు రక్షణ ఒప్పందంపై విచారణ చేపడుతోంది..’అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది.

‘‘ఓ నిందితుడు నిర్దోషినని రుజువు చేసుకోవడానికి గత్యంతరం లేక ఒక పత్రాన్ని దొంగిలించి న్యాయమూర్తికి అందజేస్తాడు. దాని ప్రకారం అతడు కచ్చితంగా అమాయకుడే. అలాంటప్పుడు ఆ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? చెప్పండి..’’ అని ధర్మాసనం సందేహం సంధించగా… ‘‘ఆ పత్రం ఎలా వచ్చిందో అతడు చెప్పాల్సి ఉంటుంది..’’’ అని ఏజీ బదులిచ్చారు.

అంతేకాకుండా, ‘‘రఫేల్‌ కేసులో అత్యున్నత న్యాయస్థానం చేసే వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని లేదా విపక్షాలను అస్థిరపరిచే ప్రమాదముందని, అలాంటి వ్యాఖ్యల జోలికి వెళ్లకపోవడమే మంచిది..’’ అని ఏజీ వ్యాఖ్యానిస్తూ రివ్యూ పిటిషన్లను కొట్టేయాలని అభ్యర్థించారు. అయితే ‘‘ఈ కేసు ‘దేశభద్రత’కు సంబంధించి కాదనీ, అవినీతి గురించే..’’అని ధర్మాసనం పేర్కొంది.

‘రఫేల్‌ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుంటే అధికార రహస్యాల చట్టం కింద ప్రభుత్వం ఆశ్రయం పొందుతుందా? అవినీతి జరిగిందని నేను అనడం లేదు.ఒకవేళ అదే జరిగి ఉన్నా ప్రభుత్వమైతే ఆచట్టం వెనుక దాక్కోలేదు కదా?’’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి వ్యాఖ్యానించారు. విచారణను మార్చి 14కి వాయిదా వేశారు. రఫేల్‌ తీర్పును సమీక్షించాలని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది ఇలా ఉండగా, ‘ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే రఫేల్‌ ఒప్పందంపై కథనాలను ప్రచురించాం. దస్త్రాల మూలాలను, వాటిని తమకు ఎవరు సమకూర్చారన్న వివరాలను బహిర్గతం చేయం’ అని ద హిందూ పబ్లిషింగ్‌ గ్రూపు ఛైర్మన్‌, సీనియర్‌ పాత్రికేయుడు ఎన్ రామ్‌ బుధవారం స్పష్టం చేశారు. రఫేల్‌కు సంబంధించిన దస్త్రాలు చోరీకి గురైనట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చదవండి: జరిగింది మార్చలేం: అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్‌లో పెట్టిన సుప్రీం
- Advertisement -