
శ్రీనగర్: ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి పథకం రచించిన ప్రధాన సూత్రధారి తాజా ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు సమాచారం. త్రాల్‌లోని పింగ్లిష్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ హతమై ఉంటాడని విశ్వసిస్తున్నట్లు భద్రతా అధికారులు సోమవారం తెలిపారు.
పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతాసిబ్బంది ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టారు. తనిఖీలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతాబలగాలపైకి కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన భద్రతాదళాలు.. ముగ్గురు జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని అధికారులు తెలిపారు.
హతుల్లో ఒకరిని ముదాసిర్ అహ్మద్ ఖాన్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడికి అహ్మద్ కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. పుల్వామా దాడిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అహ్మద్ ఖాన్ గురించి అనేక విషయాలు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలను, వాహనాన్ని ఏర్పాటుచేసింది అహ్మద్ ఖానే కావడం గమనార్హం.
ఆత్మాహుతి దాడికి పాల్పడింది 23 ఏళ్ల ఎలక్ట్రిషియన్..
త్రాల్‌లోని మిర్ మొహల్లా ప్రాంతానికి చెందిన అహ్మద్ ఖాన్(23) డిగ్రీ పూర్తిచేసి.. ఎలక్ట్రీషియన్‌గా ఐటీఐలో డిప్లొమా కోర్సు చేశాడు. అతివాద భావజాలానికి ప్రేరేపితుడై 2017లో జైషే మహ్మద్ ఉగ్ర ముఠాలో చేరాడు. తొలుత గ్రౌండ్ వర్కర్‌గా పనిచేసిన అహ్మద్ ఖాన్.. 2018 నుంచి జైషేలో క్రియాశీలకంగా మారాడు.
ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో ఆత్మాహుతి చేసుకున్న అదిల్ అహ్మద్ దార్.. దాడికి ముందు ఖాన్‌తో చాలా రోజుల పాటు సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సుమారు 300మంది ఉగ్రవాదులను హతమార్చాయి.








