
కోల్‌కతా: గురువు అనే పదానికి నిలువెత్తు రూపం ఆయన. విద్యార్థుల శ్రేయస్సు కోరే గొప్ప వ్యక్తిత్వమున్నవ్యక్తి ఆయన. ఇప్పుడాయన గురించి సోషల్ మీడియా హోరెత్తిస్తోంది.
గురువుకు నిలువెత్తు రూపం ఆయనేనంటూ కొనియాడుతోంది. ఏముందాయనలో అంత గొప్ప? ఇంతకీ ఎవరాయన?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని అహండ అనే చిన్న గ్రామానికి వెళ్లాలి.
ఆయన పేరు సుబ్రత పాటి (35). చరిత్ర పాఠాలు చెబుతాడు. కోల్‌కతాలోని అడామస్ యూనివర్సిటీ, రైస్ (ఆర్ఐసీఈ) ఎడ్యుకేషన్‌లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటాడు.
ప్రస్తుత లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో ఉంటూనే ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాడు. అందులో వింతేం ఉంది? అని అనుకుంటే ఆయన గురించి ఇంతగా వైరల్ అయ్యేదే కాదు.
ఆన్‌లైన్‌లో ఆయన పాఠాలు బోధించాలంటే పెద్ద సాహసమే చెయ్యాలి. ఆయన హిస్టరీ టీచర్ కాబట్టి.. ఆయన పరిభాషలో చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధానికి ఏమాత్రం తీసుపోకుండా పోరాడాలి.
ఆ ఊరిలో ఫోన్ సిగ్నల్స్ నేతిబీర చందమే…
ఎందుకంటే ఆ ఊర్లో సిగ్నల్స్ రావడం.. నేతి బీరలో నెయ్యి చూడడం.. రెండూ ఒకటే. ఒక్కోసారి వచ్చినట్టే వచ్చి ఆ వెంటనే ఎవరో తరుముతున్నట్టు మాయమవుతాయి.
మరొకరైతే సిగ్నల్స్ రావడం లేదని పాఠాలను స్కిప్ చేసేవారే. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. వెంటనే తన ఇంటి పక్కనే ఉన్న వేపచెట్టు ఎక్కేసి సిగ్నల్స్ పట్టేశాడు.
చెట్టుపైనే చిన్నపాటి గూడులాంటిది ఏర్పాటు చేసుకున్నాడు. కింద పడకుండా కొమ్మలకు బలంగా కట్టాడు. చెట్టుపైకెక్కా సిగ్నల్స్ ధారాళంగా రావడం మొదలుపెట్టాయి.
చిన్నపాటి అంతరాయం కూడా కలడం లేదు. ఫలితంగా తన విద్యార్థులకు కొద్దిపాటి అంతరాయం కూడా కలగకుండా పాఠాలు బోధిస్తున్నాడు.
రోజూ ఉదయాన్నే చెట్టెక్కడం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడం.. ఇప్పుడిది ఆయన జీవితంలో నిత్యకృత్యంగా మారింది.
ఆహారాన్ని తనతోపాటే పైకి తీసుకెళ్తాడు. ఒకేసారి రెండు మూడు క్లాసులు కూడా తీసుకోవాల్సి వస్తుందని పాటి పేర్కొన్నాడు.
తన విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాటి వివరించాడు.
ఆయన నిబద్ధతకు, విద్యార్థులపై ఉన్న ప్రేమకు తోటి ఉపాధ్యాయులు, కళాశాలల యాజమాన్యం నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.








