జైపూర్: భారత్ అన్ని రకాలుగా బదులిచ్చినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తన కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. భారత భూభాగంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్ చేసిన ప్రయత్నాన్ని సరిహద్దు రక్షణ దళం(బీఎస్‌ఎఫ్) తిప్పి కొట్టింది.
శనివారం రాజస్థాన్ సరిహద్దు వెంట మన దేశంలోకి ప్రవేశించడానికి డ్రోన్ విఫల ప్రయత్నం చేసింది. అయితే డ్రోన్ రాకను పసిగట్టిన బీఎస్‌ఎఫ్ దాన్ని కూల్చివేయడానికి కాల్పులు జరిపింది. దీంతో ఆ డ్రోన్ కుప్పకూలిపోయింది.
మూడో యత్నం..
కాగా, శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్ సమీపంలోని హిందూమల్‌కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఇది భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆ వెంటనే దళాలు కాల్పులు జరిపి, దాన్ని కూల్చేశాయి. కాగా, అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్ డ్రోన్ భారత్‌లోకి ప్రవేశించడానికి చేసిన మూడో ప్రయత్నం ఇది కావడం గమనార్హం. పెద్దఎత్తున ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని సరిహద్దు సమీపంలో నివసించే గ్రామస్థులు తెలిపారు.








