

న్యూఢిల్లీ/శ్రీనగర్: లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ.. కాశ్మీర్‌లో ఒకప్పుడు అతనో ఉగ్రవాది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని సైన్యంలో చేరాడు. పలు మిలటరీ ఆపరేషన్స్‌లో విజయవంతంగా పాల్గొన్న అతను.. గతేడాది జరిపిన ఓ ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అసువులు బాశాడు. అతని సేవలను గురించిన భారత ప్రభుత్వం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన్ను సైన్యంలో అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో సత్కరించింది.
కాగా, కాశ్మీర్ నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి ఆర్మీ జవాన్ లాన్స్ నాయకే కావడం విశేషం. శనివారం(జనవరి 26న) జరగిన 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వని కుటుంబం ఈ అవార్డును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకుంది.
ఓ వైపు బాధ.. మరోవైపు ఆనందం: వనీ కుటుంబసభ్యులు
వనీ వీరమరణం తర్వాత అతని తండ్రిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.లాన్స్ నాయక్ తండ్రిని ఓ జవాన్ ఓదారుస్తున్న ఫోటోను ఆర్మీ విడుదల చేసింది. దేశం ఆయన సేవలు గుర్తించి, గౌరవిస్తున్నందుకు ఆయన కుటుంబం చాలా ఆనందంగా ఉంది. అయితే అధికారులు వచ్చి వెల్లడించే వరకూ ఇలాంటి అవార్డు ఒకటుంటుందని ఉందని కూడా ఆ కుటుంబానికి తెలియదట. ఈ విషయాన్ని ఆయన భార్య మహాజబీన్ వెల్లడించారు.
‘రెండు రోజుల క్రితం వరకు నాకు అశోక చక్ర అనే అవార్డు ఉంటుందని కూడా తెలీదు. ఆయన ఆ పురస్కారం అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది’ అని మహాజబీన్ కంటతడిపెట్టారు. ఆమె.. ఇద్దరు పిల్లలతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో నివసిస్తున్నారు. ఆయన ఆశించినట్లుగా కుటుంబాన్ని చూసుకోడంతో పాటు, పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించడమే తన లక్ష్యమని తెలిపారు. ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ.. ఆపరేషన్‌కు ముందు కొద్ది సేపు తన భర్తతో మాట్లాడానని, అప్పుడు కుటుంబం బాగోగుల గురించి చర్చించుకున్నామని వెల్లడించారు.
కాగా, లాన్స్ నాయక్ 1990లో ఉగ్రవాదులతో చేతులు కలిపి పనిచేశాడని.. ఆ తర్వాతి కాలంలో లొంగిపోయి భారత ఆర్మీలో చేరాడని అధికారులు వెల్లడించారు. దాదాపు 17 మిలటరీ ఆపరేషన్స్‌లో పాల్గొన్న లాన్స్ నాయక్.. రెండుసార్లు సేన మెడల్స్ కూడా పొందాడు. ప్రమాదపు అంచుల్లోనూ సాహసానికి నాయక్ ఎప్పుడూ వెనకాడలేదని, ఆయనో నిబద్దత కలిగిన సైనికుడని అధికారులు గుర్తు చేసుకున్నారు.








