త్వరలోనే విడుదల: కొత్త రూ.100 నోటు, ఇవీ ఫీచర్లు, ఏమిటీ ‘రాణి కీ వావ్’…

new-rs-100-note
- Advertisement -

new-rs-100-note-front

ముంబై: త్వరలో కొత్త రూ.100 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణీలోకి తీసుకురానుంది. ఈ నోటు లావెండర్ రంగులో ఉంటుంది. మహాత్మాగాంధీ సిరీస్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ నోటు వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రాణి కీ వావ్’ కనిపించనుంది. 142 మిల్లీ మీటర్ల పొడవు, 66 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ నోటు ఉండనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త రూ.100 నోటు ముందు భాగంలో 100 అంకె ఉంటుంది. దేవనాగరి లిపిలోనూ ఇది ఉంటుంది. మిగతా నోట్ల తరహాలోనే మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. ఇంగ్లీషులో ఆర్బీఐ, ఇండియా అనే అక్షరాలు.. హిందీలో భారత్, 100 అనే అక్షరాలను పొందుపరిచారు. గాంధీ ఫొటోకు కుడివైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. కుడివైపునే అశోకుడి నాలుగు సింహాలు.. గాంధీ, 100 సంఖ్యల వాటర్ మార్క్ కూడా ఉంటాయి.
new-rs-100-note-backనోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో, నినాదం ఉంటుంది. రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషల్లో వంద రూపాయలు అని రాసి ఉంటుంది. రాణి కీ వావ్ చిత్రం, దేవనాగరి లిపిలో १०० అని రాసి ఉంటుంది.
‘రాణి కీ వావ్’ ప్రత్యేకత…

గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి ‘రాణి కి వావ్’. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాజితాలో చోటు దక్కింది. ఈ బావిని 11వ శతాబ్దంలో పఠాన్ రాజు సిద్ధార్థ జైసింగ్ నిర్మించారు. ఇది ఆనాటి భార‌తీయుల సాంకేతికతకు తార్కాణంగా నిలిచింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం కోసం నిర్మించిన ఈ మెట్ల‌ బావి ఓ అద్భుతం!

తొమ్మిది వందల ఏళ్లకుపైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు ఏడు శతాబ్దాలపాటు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి.. అది పాడవకుండా త‌వ్వ‌కాలు చేప‌ట్టి.. మ‌ట్టికొట్టుకుపోయిన ఈ క‌ట్ట‌డాన్ని పున‌రుజ్జీవనంలోకి తెచ్చారు!

నిర్మాణం ఓ అద్బుతం…

ఈ బావి పొడ‌వు. 209 అడుగులు, వెడ‌ల్పు 65 అడుగులు , లోతు 88 అడుగులు. చూడ‌డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. ‘రాణి కీ వావ్’ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు దశవతారాలు క‌నిపిస్తాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని, ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.

- Advertisement -