

కాఠ్మాండ్: నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో భారత కరెన్సీలోని పెద్ద నోట్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి నేపాల్లో భారత కరెన్సీకి చెందిన రూ.2000, రూ.500, రూ.200 నోట్లు చెల్లబోవని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో నేపాల్లోని ఉన్న భారత పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది.
ఈ మేరకు నేపాల్ జాతీయ బ్యాంకు ఆదివారం నేపాలీ ట్రావెల్సర్, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్కు నోటీసులు జారీ చేసింది. రూ.100 కంటే ఎక్కువ విలువ ఉన్న భారత కరెన్సీని ఇక ఉపయోగించరాదంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. వంద, అంత కంటే తక్కువ విలువ చేసే భారత కరెన్సీ మాత్రం అక్కడ ఉపయోగించేందుకు అనుమతి ఉందని పేర్కొంది.
పర్యాటకులకు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు
భారత కరెన్సీలోని పెద్ద నోట్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నామని గత సంవత్సరం డిసెంబరు 13న నేపాల్ కేబినెట్ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. భారత కరెన్సీపై నిషేధం విధించడాన్ని అక్కడి ట్రావెల్ ట్రేడర్లు, వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం నేపాల్ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక, నేపాల్లో పర్యటించే భారతీయులు తమ కరెన్సీని డాలర్లు, యూరోల్లో మార్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2016లో భారత్ నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత రూ.2వేలు, రూ.500, రూ.200ల కొత్త నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా నేపాలీలు కొత్త భారత కరెన్సీని వాడుతున్నారు. తాజాగా నేపాల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో పర్యాటకంపై ఆధారపడిన వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు.








