27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రోస్టర్ ఆధారిత రిజర్వేషన్లు: మోడీ చివరి కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..

రోస్టర్ ఆధారిత రిజర్వేషన్లు: మోడీ చివరి కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..

arun-jaitley
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాబోతున్న తరుణంలో కేంద్ర కేబినెట్‌ గురువారం పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. విశ్వ విద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకుల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (ఎస్‌ఈబీఎల్) వారికి రిజర్వేషన్లు కల్పించడానికి తీసుకురావాల్సిన ఆర్డినెన్స్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఉన్నత విద్యాసంస్థల్లో ఇంతకు ముందు అమల్లో ఉన్న 200 పాయింట్ల రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. గతంలో ఓ విభాగం లేదా సబ్జెక్టును ఒక యూనిట్‌గా గుర్తిస్తూ రిజర్వేషన్లు అమలు చేసేవారు. కానీ దీనిని మార్చి యూనివర్సిటీ లేదా కాలేజీని ఒక యూనిట్‌గా గుర్తిస్తూ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

ఎన్నికలకు ముందు ఇదే చివరి భేటీ కావడంతో ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పెండింగ్‌ అంశాలన్నింటిపై నిర్ణయం తీసుకొనే దిశగా అడుగులు వేసింది. మొత్తంగా రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. విభిన్న రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

పలు కీలక కేబినెట్ నిర్ణయాలు

విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల అమలుకు విశ్వవిద్యాలయాన్నే యూనిట్‌గా తీసుకోవాలని కేంద్ర నిర్ణయించింది. ఆచార్యుల పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కోటా భర్తీకి ఉద్దేశించిన ‘ది సెంట్రల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (రిజర్వేషన్స్‌ ఇన్‌ టీచర్స్‌ కేడర్‌) ఆర్డినెన్స్‌ 2019’ జారీకి పచ్చజెండా ఊపింది.

ఇప్పటివరకూ డిపార్టుమెంట్లు, సబ్జెక్టుల వారీగా ఉన్న రిజర్వేషన్లను ఇక మీదట విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా తీసుకొని అమలుచేయడానికి ఇది వీలుకల్పిస్తుంది. ఉన్నత విద్యా రంగంలోకి అర్హులైన అన్ని వర్గాల వారిని ఆహ్వానించి బోధనా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇది వీలుకల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. దీనివల్ల ఉన్నత విద్యారంగంలో ఖాళీగా ఉన్న 5వేల అధ్యాపక పోస్టుల భర్తీకి వీలవుతుందని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగంలోని అధికరణలు 14, 16, 21 ప్రకారం రిజర్వేషన్లు యథాతథంగా కల్పించడానికి మార్గం ఏర్పడుతుందని పేర్కొంది.

ముంబై అర్బన్ ట్రాన్స్‌స్పోర్ట్ స్కీం 3ఎ దశకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,849 కోట్లు. అయిదేళ్లలో పూర్తిచేయాలన్నది లక్ష్యం. పూర్తయ్యేనాటికి వ్యయం రూ.33,690 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.

రూ.24,948.65 కోట్ల వ్యయంతో దిల్లీ మెట్రోరైలు 4వ దశ నిర్మాణానికి ఆమోదం.
ఆగ్నేయ రైల్వేలో పశ్చిమబెంగాల్‌, ఒడిశాల్లోని నారాయణ్‌ఘర్‌, భద్రక్‌ మధ్య 155 కిలోమీటర్ల మేర మూడో రైలు మార్గం(లైన్‌) నిర్మించాలని నిర్ణయించారు. వ్యయ అంచనా రూ.1,866.31 కోట్లు. 2023-24కల్లా దీన్ని పూర్తిచేయాలన్నది లక్ష్యం.

చక్కెర పరిశ్రమలకు ఆర్థిక సాయం కింద అదనపు నిధులు విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనివల్ల చక్కెర మిల్లుల ఉత్పత్తి సామర్థ్యంతో పాటు, ఇథనాల్‌ ఉత్పత్తి స్థాయి పెరుగుతుందని అంచనా. చక్కెర మిల్లులకు బ్యాంకులు మంజూరు చేసిన రూ.12,900 కోట్ల రుణాలకు గాను రూ.2,790 కోట్ల వడ్డీని కేంద్రమే చెల్లిస్తుంది. 2018 జూన్‌లో ప్రకటించిన రూ.4,400 కోట్ల రుణంపై చెల్లించే రూ.1,332 కోట్ల వడ్డీ రాయితీకి ఇది అదనం. కేవలం మొలాసిస్‌ ఉత్పత్తి చేసే డిస్టిలరీ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2600 కోట్ల రుణంపై రూ.565 కోట్ల వడ్డీ రాయితీని భరించడానికీ కేంద్రం అంగీకరించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, సివిల్‌ ఎన్‌క్లేవ్స్‌, సీపీఎస్‌యూల ఆధ్వర్యంలో ఉన్న వినియోగంలో లేని, పాక్షిక వినియోగ ఎయిర్‌స్ట్రిప్స్‌, హెలీప్యాడ్స్‌, వాటర్‌ ఏరోడ్రోమ్స్‌ని పునరుద్ధరించడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.4,500 కోట్ల నిధులను కేటాయిస్తుంది.

మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీంలోకి ఇప్పటి వరకూ రాని వారికి అవకాశం కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల జీవిత భాగస్వాములు, ఎమర్జెన్సీ కమిషన్డ్‌ ఆఫీసర్లు, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ ఆఫీసర్లు, ముందస్తుగా పదవీవిరమణ చేసిన వారు ఇప్పుడు ఈ ఈసీహెచ్‌ఎస్‌ ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సుమారు 43వేల మంది లబ్ధిపొందుతారు.

ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం-4ని 12వ పంచవర్ష ప్రణాళిక తర్వాత మూడేళ్ల పాటు కొనసాగించాలని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే 2017 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు దీని కొనసాగింపునకు వీలుగా రూ.6,434.76 కోట్లు కేటాయించారు.

రవాణా రంగంలో పెనుమార్పులు తీసుకురావటం కోసం ఓ జాతీయ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కేంద్ర మంత్రి మండలి అనుమతించింది. విద్యుత్‌తో నడిచే వాహనాల ఉత్పత్తికి ఉద్దేశించిన దశలవారీ తయారీ కార్యక్రమాన్ని(పీఎంపీ) 2024 వరకు అమలు చేయాలని నిర్ణయించింది. పెద్దమొత్తంలో స్టోరేజి బ్యాటరీలు, సెల్‌ల తయారీకి పత్యేక చొరవ తీసుకుంటారు.

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ను వచ్చే ఏడాది(2019-20)లోనూ కొనసాగించటానికి రూ.1000 కోట్ల కేటాయింపు. ఈ కార్యక్రమం కింద పాఠశాలల్లో ప్రయోగశాలల స్థాపన, నిర్వహణకు నిధులు అందజేస్తారు. దేశంలో కొత్తగా 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది.

అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం కింద పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, ఆవిష్కరణల దృక్కోణాన్ని పెంపొందించడానికి సంబంధించిన ప్రయోగశాలలను కూడా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ ప్రయోగశాలలకు ప్రభుత్వం తొలి ఏడాది రూ.12 లక్షల చొప్పున మంజూరు చేస్తుంది. అనంతరం నిర్వహణ కోసం నాలుగేండ్లపాటు ఏటా రూ.2 లక్షల చొప్పున విడుదల చేస్తుంది.

దేశవ్యాప్తంగా 5,441 ప్రయోగశాలలను ఎంపిక చేసిన కేంద్రం.. ఇప్పటికే 2171 ప్రయోగశాలలకు నిధులు మంజూరు చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లను (ఏఐసీ)కూడా ఎంపిక చేసిన కేంద్రం.. ఇందులో 31 ఏఐసీలకు నిధులను విడుదల చేసింది. కాగా, విశ్వవిద్యాలయం యూనిట్‌గా భోదనా సిబ్బంది నియామకాల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్ల అమలుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపటంపై కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అధినేత రామ్‌ విలాస్‌ పాసవాన్‌ హర్షం వ్యక్తం చేశారు.  ఈ నిర్ణయం వల్ల అధ్యాపక పోస్టుల భర్తీలో ఈ వర్గాల వారికి సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు.

చదవండి: మోడీ సారథ్యంలో చివరి కేబినెట్ భేటీ, ఎన్నికల వేళ వరాల జల్లు కురిపిస్తారా?

- Advertisement -