
న్యూఢిల్లీ: తీహార్ జైలులో తనపై లైంగిక దాడి జరిగిందని, ఆ విషయం జైలు అధికారులకు కూడా తెలుసు అంటూ ‘నిర్భయ’ కేసులో మరణశిక్ష పడిన దోషి ముఖేష్ కుమార్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.
ఈ కేసులో సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ తనను జైలులో లైంగికంగా వేధించాడని, ఈ విషయాన్ని తాను తన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రపతి తన పిటిషన్‌ను సరిగా చూడలేదని ముఖేష్ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: అప్పుడు నేను పిల్లాడిని.. శిక్ష తగ్గించండి: సుప్రీంకు నిర్భయ దోషి
2012 డిసెంబర్ నెలలో ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపి, ఆపైన చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మలను దోషులుగా ప్రకటించి, వారికి మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఈ తీర్పుపై నిందితుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ సింగ్ ఇప్పటికే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అతడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు.
అయితే ఈ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా జనవరి 17న తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఊరితీయాల్సిందిగా కోర్టు నుంచి డెత్ వారెంట్ కూడా జారీ చేసింది.
చదవండి: ఉరే సరి! ‘నిర్భయ’ కేసులో రాష్ట్రపతి కీలక నిర్ణయం, దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ…
ఇక మరో దోషి అక్షయ్ ఠాకూర్ కూడా ఇప్పటికే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు దానినీ తోసిపుచ్చింది. మిగిలిన ఇద్దరు దోషులు పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మలు ఇంకా క్యూరేటివ్ పిటీషన్‌ను దాఖలు చేయలేదు.
ఐదారు రోజుల్లో ఉరిశిక్ష అమలుకానుండగా…
మరో ఐదారు రోజుల్లో ఉరిశిక్ష అమలుకానుండగా.. దోషి ముఖేష్ సింగ్ రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తన న్యాయవాది ద్వారా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
నిజానికి ఖైదీ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత దానిపై సవాల్ చేసే హక్కు ఎవరికీ ఉండదు. అయితే ఈ తరుణంలో దోషి ముఖేష్ సింగ్ తనపై తీహార్ జైలులో లైంగికదాడి జరిగిందని ఆరోపించడం ఈ కేసులో ప్రాధాన్యం సంతరించుకుంది.
చదవండి: నా బిడ్డను క్షమించండి.. కోర్టులో కొంగుచాచిన నిర్భయ దోషి తల్లి
ఉరిశిక్ష అమలుకు గడువు దగ్గరపడుతున్న సమయంలో ఈ విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నట్లు ఈ కేసులో విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ఉరిశిక్ష అమలును ఫిబ్రవరి 1న నిర్మయించినందున మెన్షనింగ్ ఆఫీసర్‌ను కలవాలంటూ ముఖేష్ సింగ్ తరఫు న్యాయవాదికి బెంచ్ సూచించింది.








