
ఐజ్వాల్: పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. అభం శుభం తెలియనివారు.. తప్పొప్పులతో సంబంధం లేకుండా అన్ని పనులను ఎంతో దయతో చేస్తుంటారు. ఇతర ప్రాణుల పట్ల ఎంతో దయను కలిగి ఉంటారు. మిజోరాంలో ఓ చిన్నపిల్లవాడు చూపిన మానవత్వం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. అతనికి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది.
ఆ పిల్లవాడి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది. ఇందులో ఒక చేతిలో రూ.10 నోటు, రెండో చేతిలో గాయపడిన కోడిపిల్లని పట్టుకొని ఉన్నాడు. కాగా, ఈ ఫోటోలో ఉన్నది మిజోరామ్ రాజధాని ఐజ్వాల్‌లోని సైరంగ్ ప్రాంతంలో నివసించే బాలుడు.
కోడిపిల్లను కాపాడాలంటూ..
వివరాల్లోకి వెళితే.. ఈ పసివాడు పొరపాటుగా ఒక కోడిపిల్లపైనుంచి సైకిల్ పోనిచ్చాడు. వెంటనే సైకిల్ ఆపి కోడిపిల్లను చేతుల్లోకి తీసుకొని తన దగ్గర ఉన్న డబ్బు(రూ.10)తో దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాడు. హాస్పిటల్‌కి వెళ్లి అక్కడి డాక్టర్లకు గాయపడిన కోడిపిల్లను చూపించి దానికి వెంటనే చికిత్స చేసి కాపాడాలని కోరాడు.
తన దగ్గరున్న డబ్బులు తీసుకొని కోడిపిల్లకి చికిత్స చేయాలని పిల్లాడు ఆస్పత్రిలో డాక్టర్‌ని కోరడంతో వారెంతో ముచ్చటపడ్డారు. వెంటనే అతడ్ని ఫొటో తీశారు. అయితే, ఆ కోడిపిల్ల అప్పటికే చనిపోయిందనే విషయం మాత్రం ఆ పిల్లవాడికి తెలియదు. దీంతో ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది ఆ కోడి చనిపోయిందని, దానికి చికిత్స చేయలేమని పిల్లాడికి చెప్పి ఇంటికి పంపించారు.
ఇంటర్నెట్ సూపర్‌స్టార్.. ప్రశంసా ప్రతంతో సన్మానం
డెరెక్ సీ లా్చన్హిమా అనే ఈ బాలుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో సాంగా సేస్ పేరుతో ఒక యూజర్ ఈ పోస్ట్‌ని షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ పోస్ట్ పై లక్ష మందికి పైగా స్పందించారు. ఈ పోస్ట్ 80,000 సార్లకు పైగా షేర్ అయింది. ఈ పోస్ట్ పై సుమారు 10,000 కామెంట్లు వచ్చాయి.
దీంతో ఇతడు ఇంటర్నెట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలో అతడు చదువుతున్న పాఠశాల కూడా అతడ్ని గౌరవించాలనుకుంది. ప్రాణుల పట్ల ఉన్న దయా గుణానికి సెయింట్ పియో సైరంగ్ పాఠశాల అతనికి ఒక ప్రశంసా పత్రాన్ని అందించి సన్మానించింది.








