26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం శత్రుదేశాల రాడార్లకు చెక్: పీఎస్ఎల్వీ సీ45 ప్రయోగం విజయవంతం

శత్రుదేశాల రాడార్లకు చెక్: పీఎస్ఎల్వీ సీ45 ప్రయోగం విజయవంతం

- Advertisement -

శ్రీహరికోట: మిషన్ శక్తి తర్వాత భారత శాస్త్రవేత్తలు మరో ప్రయోగాన్ని విజయంతం చేశారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-45 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఉదయం 9.27 గంటలకు ప్రయోగాన్ని చేపట్టారు.

ఈ వాహక నౌక డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలిజెన్స్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌ను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో పాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. మరో గంటలో మిగతా ఉపగ్రహాలు ఆయా కక్ష్యల్లో చేరనున్నాయి.

కాగా, లిథువేనియా, స్పేయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను ఇది నింగిలోకి మోసుకెళ్లింది. ఒకే ప్రయోగంలో మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి.

నిఘా వ్యవస్థ పటిష్ఠం..,

డీఆర్‌డీవో రూపకల్పన చేసిన ఇమిశాట్‌ 436 కేజీల బరువుంటుంది. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందించనుంది. ఇప్పటివరకూ ఇలాంటి సమాచార సేకరణలో విమానాలపై భారత్‌ ఆధారపడుతోంది.

ఇక నుంచి అంతరిక్ష ఫ్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రానుంది. మొదటిసారిగా ఇస్రో తన ప్రయోగాలను వీక్షించేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది. ఇటీవల ఏశాట్‌ ద్వారా కక్ష్యలో తిరుగుతున్న ఉగప్రహాన్ని కూల్చి చరిత్ర సృష్టించిన భారత్.. తన సత్తా ఎంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

 

- Advertisement -