#మీటూ ఉద్యమం నేపథ్యంలో, మీడియా రంగంలో ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు టీవీ చానల్‌లో గతంలో పని చేసిన ఓ సీనియర్ న్యూస్ ప్రొడ్యూసర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒక మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మానసికంగా లైంగికంగా అతను ఎంతో వేధించాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ నేపథ్యంలో సదరు సీనియర్ న్యూస్ ప్రొడ్యూసర్‌ను నోయిడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
వివరాల్లోకి వెళితే.. తన శరీర భాగాల షేపులు గురించి ఆ న్యూస్ ప్రొడ్యూసర్ తనను అడిగాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఒక సర్వే నిర్వహిస్తున్నానని చెప్పాడని… ఆ తర్వాత మరింత దారుణమైన ప్రశ్నలు అడిగాడని చెప్పింది. ఆఫీసులో మానసికంగా తనను ఎంతో వేధించాడని తెలిపింది. తాను అప్పుడే (2016) కొత్తగా ఉద్యోగంలో చేరానని… అందుకే ధైర్యంగా ఈ విషయాన్ని బయటికి.. ఎవరితో చెప్పుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం మరో మహిళ కూడా సదరు న్యూస్ ప్రొడ్యూసర్ నుంచి తనకు కూడా అలాంటి అనుభవమే ఎదురైందని చెప్పడంతో… ఇప్పుడు ధైర్యంగా ఆనాటి విషయాన్ని చెప్పాలనుకున్నానని తెలిపింది. ఒకవేళ అతను తనకు క్షమాపణలు చెప్పినా సరే…. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇతర మహిళలను అతను వేధించడం ఆపేస్తాడని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. సదరు న్యూస్ ప్రొడ్యూసర్ కూడా ఆ మహిళా జర్నలిస్టుపై ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆమె.. కాబోయే భర్తతో కలసి రూ.25 లక్షల డబ్బు కోసం తనను ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించాడు.