25.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కోల్‌కతాలో వైద్యుల సమ్మె: మమత-బీజేపీ మధ్య ముదిరిన మాటల యుద్ధం…

కోల్‌కతాలో వైద్యుల సమ్మె: మమత-బీజేపీ మధ్య ముదిరిన మాటల యుద్ధం…

- Advertisement -

కోల్‌కతా: ఎన్నికల దగ్గర నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి , పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా కోల్‌కతాలో వైద్యుల సమ్మె నేపథ్యంలో వీరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మరణించాడంటూ సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో రోగి బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేసి చితక్కొట్టారు.

ఈ దాడిలో ఆ వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు.  దీంతో తమకు రక్షణ కల్పించాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ వైద్యులు తమ సేవలను నిలిపివేసి సమ్మెకు దిగారు. ప్రస్తుతం వీరి సమ్మె మూడో రోజుకు చేరుకుంది.

వైద్యులకు మమత వార్నింగ్…

ఇక రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు బీజేపీ చీఫ్, హోంమంత్రి ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. ముస్లిం రోగులకు వైద్యం చేయవద్దని బీజేపీ నుంచి వైద్యులకు ఆదేశాలు వెళ్లాయని సంచలన ఆరోపణలు చేశారు. రోగులను హిందూ-ముస్లింలుగా ఎలా విభజిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడూ ఆ పార్టీ ప్రమాదకరమైన ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

అలాగే సమ్మె కారణంగా వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని, రోగులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. సమ్మె చేస్తున్న వైద్యులు వెంటనే విరమించి విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని మమత ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని వైద్యులు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అటు  సమ్మె చేస్తున్న వైద్యులపై ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు తక్షణం ఆమె వైద్యశాఖా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ, సీపీఎంలు విరుచుకుపడుతున్నాయి.

చదవండి: టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేకేకు కీలక బాధ్యతలు
- Advertisement -