
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఓ కారులో సంభవించిన పేలుడు కలకలం రేపింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌కు అతి సమీపంలో ఈ పేలుడు జరగడంతో మరోసారి భయాందోళనలకు గురయ్యారు. జవాన్లను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిపారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఉలిక్కపడ్డ జనం..
కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో బనిహల్ ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో శనివారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత ఫిబ్రవరిలో పుల్వామాలో జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది కారుతో దాడి చేసి 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న విషయం విధితమే.
ఈ దారుణ ఘటన తర్వాత జరిగిన పేలుడు స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సిలిండర్ పేలుడు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అయితే, ఉగ్రవాదుల కుట్ర కోణంలోనూ పేలుడుపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








