ఇక ‘ఆల్ ఇన్ వన్ కార్డు’కు కేంద్రం యోచన: అమిత్ షా వెల్లడి

2:18 pm, Tue, 24 September 19
single-multi-purpose-id-card-says-amit-shah

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలోని పౌరుల జేబులు కార్డులతో నిండిపోతున్నాయి. పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని కార్డులు. అయితే, ఇకపై ఇన్ని కార్డులు జేబులో వేసుకుని తిరిగే బాధ తప్పనుంది.

‘ఒకే దేశం-ఒకే కార్డు’ పేరుతో అన్నింటి వివరాలు ఒకే కార్డులో నిక్షిప్తం చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు ఇలా అన్నింటినీ వేర్వేరుగా వెంట తీసుకెళ్లే పనిలేకుండా వాటి స్థానంలో ‘ఆల్ ఇన్ వన్’ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

యాప్‌తో జనాభా లెక్కలు…

భారత రిజిస్ట్రార్ జనరల్/జనగణన కమిషన్ కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన అనంతరం షా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ దిశగా చర్యలు ప్రారంభమైనదీ, లేనిదీ వెల్లడించలేదు. బహుళ ప్రయోజనకార్డు వలన చాలా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు.

ఈసారి జనాభా లెక్కలను మొబైల్ యాప్‌తో నిర్వహిస్తున్నట్టు చెప్పిన షా.. తొలిసారి కలం, కాగితం అవసరం లేకుండా జనాభాను లెక్కిస్తున్నట్టు తెలిపారు. కొత్త మొబైల్ యాప్‌లో ఎవరైనా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని అమిత్ షా పేర్కొన్నారు.

2021 జనాభా లెక్కల కోసం, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR-జాతీయ జనాభా పట్టిక) కోసం కేంద్రం రూ.1200 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపట్టబోతున్న 8వ జనాభా లెక్కల సేకరణ అని,  2021 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలకు ఈ సేకరణ ముగుస్తుందని అమిత్ షా చెప్పారు.

జనాభా లెక్కలకు తొలిసారి మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నామని, ఇది జనగణనలో విప్లవాత్మక మార్పు కానుందన్నారు. సంపూర్ణ జనగణన కోసం పదహారు భాషల్లో ఆ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. NPRను తయారు చేయబోతున్నట్లు తెలిపారు.