ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. బీజేపీ భవిష్యత్తును తేల్చనున్నాయా?

narendra-modi
- Advertisement -
modi-amit-shah
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు డిసెంబరు 7న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌ శాసనసభల ఎన్నికల షెడ్యూలును కూడా ఎన్నికల సంఘం  ఇటీవల విడుదల చేసింది.
నవంబర్ 28న మిజోరం, మధ్యప్రదేశ్‌లలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశలలో.. నవంబర్ 12న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత  ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
తెలంగాణలో ఇదివరకే ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ తెలిపారు. డిసెంబర్ 15 నాటికి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు  తగిన ఏర్పాట్లు  చేయడంలో ఎన్నికల సిబ్బందికి ప్రణాళికలు, నివేదికలు సిద్ధం చేసే పనిలో..  ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు ఉన్నారని  రావత్ తెలిపారు.
సమస్యాత్మక గ్రామాల్లో తగినన్ని బలగాలు రప్పించేందుకు తీసుకోవాల్సిన వివరాలను తమకు పంపించమని ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కూడా ఆయన తెలిపారు.
తెలంగాణ, రాజస్థాన్‌లో  డిసెంబరు 7న..

తెలంగాణ, రాజస్థాన్‌లలో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 12న నోటిఫికేషన్ వస్తుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు నవంబర్ 20 అని, నామినేషన్ల పరిశీలన నవంబర్ 20న, నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు నవంబర్ 22వ తేదీ అని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ వెల్లడించారు.

బీజేపీ భవిష్యత్తును తేల్చే ఎన్నికలు…

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కేంద్రంలోని బీజేపీ భవిష్యత్తును తేల్చబోతున్నాయా?  అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు అవుననే పేర్కొంటున్నారు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో పథకాలు వికటించడం.. మరోవైపు.. తెలుగుదేశం, బీజేపీ కారణంగానే ఆంధ్రా భవిష్యత్తు ఆగిపోయిందనే ఒక ప్రచారంతో దాదాపు ఆంధ్రాలో బీజేపీ అడ్రసు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక్క ఆంధ్రలోనే కాదు, ఇటు తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.  అయితే తెలంగాణలో ఆ పార్టీ టీఆర్ఎస్‌తో పొత్తుగానీ కుదుర్చుకోగలిగితే మాత్రం కొద్దిగా ఊపిరి తీసుకోగలుగుతుంది.  మొత్తంగా చెప్పాలంటే ఇటు ఆంధ్రలోనూ, అటు తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
ఈ పరిస్థితుల్లో.. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు.. ఆంధ్రాలో (25) ఉండకపోయినా.. ఒకవేళ అప్పటి పరిస్థితిని బట్టి వైఎస్సార్సీపీ గనుక ఏమైనా మద్దతిస్తే వారికి వచ్చిన సీట్లు, ఇక తెలంగాణ (17)లో కేసీఆర్‌కి వచ్చే సీట్లు ఉపయోగపడే అశకాశాలున్నాయి. మొత్తంంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 42కి.. టీఆర్ఎస్, వైెఎస్సార్ కాంగ్రెస్, (ఒకవేళ మద్దతిస్తే).. కనీసం ఒక 22 సీట్ల వరకు బీజేపీకి మద్దతిచ్చేవిగా కనిపిస్తున్నాయి..

ఇదీ లెక్క…

అలాగే మధ్యప్రదేశ్ 29, రాజస్థాన్ 25, మిజోరాం 1, ఛత్తీస్ ఘడ్ 11.. ఇవి లోక్ సభ సీట్లు కాగా..
రాజస్థాన్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండడం ఒక రకంగా వారికి కలిసి వచ్చే అంశమే అయినా.. అక్కడ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాలకుగాను 10 వచ్చినా గొప్పే అంటున్నారు.
ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే..  బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ..  ఇక్కడ కూడా రాజస్థాన్ తరహాలోనే  ప్రబుత్వ వ్యతిరేకత ఉండడంతో మొత్తం  29 ఎంపీ స్థానాలకుగాను అక్కడ 10 వరకు వచ్చే అవకాశాలున్నాయని, ఇక ఛత్తీస్ ఘడ్ లో 11 స్థానాలకు 5 స్థానాలు వచ్చే సూచనలున్నాయని  సర్వేలు ఘోషిస్తున్నాయి.
ఇలా ఐదు రాష్ట్రాల్లో అన్ని లోక్‌సభ స్థానాలు కలిపి.. మొత్తం 108 స్థానాలకుగాను .. 48  స్థానాలు (మద్దతిచ్చే వాటితో కలిపి) బీజేపీకి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కిం కర్తవ్యం? 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తే కథ వేరేగా ఉంటుంది. ఓడిపోతే మాత్రం.. మధ్యే మార్గంగా ఈ అంకె దగ్గర ఆగవచ్చు. లేదా కౌంట్ డౌన్ పెరగవచ్చు కూడా.  ఏదేమైనా ఫలితాల సరళిని బట్టి.. ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి.. సంక్షేమ పథకాలను ఎడాపెడా ప్రకటించి.. ప్రజలకు సాంత్వన చేకూర్చవచ్చునని.. తద్వారా కొంత శాతం ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉందని ఒక వర్గం చెబుతోంది.
సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష…
ఏయే విషయాల్లో అయితే ప్రజలు బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల విముఖంగా ఉన్నారో.. వాటిల్లో గనుక జాగ్రత్తలు తీసుకుని.. తిరిగి ప్రజలకు చేరువైతే బీజేపీ పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం… నిర్వీర్యమైపోతున్న బ్యాంకులను రక్షించడంతోపాటు, బ్యాంకులు అందిస్తోన్న సేవల్లో పట్టు విడుపులు ఉండాలి.
బ్యాంకులో వేయడానికి రూ.2 లక్షలు అనే శ్లాబ్ సిస్టం నిబంధనను తొలగించడం, అలాగే రూ.10 లక్షల వరకు పాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను కాస్తంత సవరించడం, బంగారం కొనుగోళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, బ్యాంక్ ఎకౌంట్లు, పాన్ నంబర్ల వివరాలు తొలగించడం.. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాదరణ పొందేందుకు అవకాశాలున్నాయి.
ఇక రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిబంధనలను కూడా కాస్తంత సడలించాల్సిన అవసరం కనిపిస్తోంది.  ఎందుకంటే ఒక మధ్య తరగతి వ్యక్తి తన అవసరానికి  తనకున్న భూమిని గనుక అమ్ముకుంటే.. ఆ వచ్చిన డబ్బును అటు బ్యాంకులో వేసుకోలేక.. ఇటు ఇంట్లో దాచుకోలేని పరిస్థితి.
కొందరు తెగించి బ్యాంకు ఖాతాలో వేసి చివరకు ఆదాయపు పన్ను శాఖకు లెక్కలు చెప్పలేక సతమతమవుతున్నారు. అలాగే పదవీ విరమణ పొందిన వ్యక్తులు.. తమకు వచ్చిన సొమ్మును బ్యాంకులో వేసుకున్నా ఆదాయపన్ను శాఖ అధికారులు కొరడాను కాచుకోవాల్సి వస్తోంది.  ఈ విషయంలోనూ మోడీ ప్రభుత్వం నిబంధనలను కాస్తంత సడలిస్తే బాగుంటుందనేది ఆ పార్టీని మళ్లీ అధికారంలో చూడాలనుకుంటున్న వారి సలహా.
ఇంకా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణం తగ్గించడంలాంటివి చేస్తే.. లోక్‌సభ ఎన్నికలు వచ్చేలోగా మధ్యతరగతి ప్రజల మనసును బీజేపీ దోచుకోవచ్చు.  తద్వారా బీజేపీ గ్రాఫ్ పడిపోకుండా నిలబడుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొటున్నారు.

– శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -