న్యూఢిల్లీ : మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి బుధవారం ఐఎన్‌ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆగస్టు 1 వరకూ మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తనను ఈడీ అరెస్ట్ చేస్తుందనే ఆందోళన ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం అప్పీల్‌లో పేర్కొనడంపై కోర్టు ఈడీ స్పందనను కోరింది. ఈడీ విచారణకు సహకరించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లరాదని సూచిస్తూ జస్టిస్ కే పాథక్ చిదంబరానికి మధ్యంతర రిలీఫ్ కల్పించారు.
ఆగస్టు 1న ఈడీ, సీబీఐలు దాఖలు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులపై చిదంబరం ముందస్తు బెయిల్‌పై విచారణ చేపట్టే వరకూ ఈడీ ఆయనపై ఎలాంటి తీవ్ర చర్యలు చేపట్టరాదంటూ హైకోర్టు ఆదేశించింది.
అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చిదంబరం అప్పీల్‌ను వ్యతిరేకించారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విచారణ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో హైకోర్టును ఆశ్రయించారని మెహతా పేర్కొన్నారు.
ప్రధాన కేసులో కాంగ్రెస్ నేత కస్టడీ విచారణ అవసరమని సీబీఐ చెబుతుండటంతో.. అరెస్ట్‌పై తమ క్లయింట్ ఆందోళన చెందుతున్నారని చిదంబరం తరపున హాజరైన న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ కోర్టుకు నివేదించారు.