
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాల్ఘాట్లో ఉన్న ముడి ఖనిజం తవ్వకం విధుల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులను చైనాకు చెందిన ఓ కంపెనీ తొలగించింది. దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందునే కార్మికులను తొలగించాల్సి వచ్చిందని కంపెనీ చెబుతుండగా, లాక్డౌన్ విధించిన సమయంలోనే తమతో కంపెనీ పనులు పనులు చేయించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాల్ఘాట్లో మాంగనీస్ ముడి ఖనిజం గనులు ఉన్నాయి. ఇక్కడ తవ్వకం పనులను భారత ప్రభుత్వానికి చెందిన మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంవోఐఎల్) చైనాకు చెందిన ఓ కంపెనీకి కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. అయితే, గల్వాన్‌లో ఇరుదేశాల మధ్య ఘర్షణ నేపథ్యంలో తమ వద్ద కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న 72 మందిని ఎలాంటి కారణం చూపకుండానే విధుల్లో నుంచి తొలగించింది. కార్మికులు ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో దిగొచ్చిన కంపెనీ తొలగిస్తున్న కార్మికులకు అడ్వాన్స్‌గా రూ.10 వేలు చెల్లిస్తామని అంగీకరించింది. అయితే, చివరికి 5 వేల రూపాయలు చేతిలో పెట్టినట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనే తమతో తవ్వకం పనులు చేయించారని, తమలో ఎవరికీ కరోనా వైరస్ సోకనప్పటికీ గాల్వాన్ ఘర్షణను దృష్టిలో పెట్టుకొనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
అయితే, కంపెనీ వాదన మరోలా ఉంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పక్కనపెట్టామని, నిత్యావసరాల కోసం అడ్వాన్స్ కూడా చెల్లించామని ఎంవోఐఎల్ కంపెనీ మేనేజనర్ ఉమాయిద్ సింగ్ భట్టి తెలిపారు. గాల్వాన్ ఘర్షణలకు, వీరి తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.








