
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్న ప్రియాంక గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆమె పాల్గొన్న ఎన్నికల ప్రచారానికి కొందరు చిన్నారులు కూడా వచ్చారు.
ఇక ప్రచారానికి వచ్చిన పిల్లలు ‘చౌకీదార్ చోర్ హై’ అని గట్టిగా నినదించారు. అయితే వారిని చూసిన ప్రియాంక.. అలా అనడం తప్పని వారిని వారించారు. మంచి మాటలు మాత్రమే మాట్లాడాలని పిల్లలకి హితవు పలికారు. అయితే ఆ చిన్నారులు ప్రధానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో కాస్తా జాతీయ బాలల హక్కుల సంఘం దృష్టిలో పడింది. దీంతో బాలల హక్కుల సఘం తీవ్రంగా స్పందించింది. ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను తీసుకురావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే పిల్లల పేర్లు, పూర్తి వివరాలు, ఘటన ఎక్కడ జరిగిందీ తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. ఇదేకాక ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లింది.








