

న్యూఢిల్లీ: ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలని దేశంలోని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికలను పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే ప్రసక్తే లేదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోరా స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాకింగ్ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సైబర్ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ షుజా అనే వ్యక్తి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లే ఉపయోగించాలంటూ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
గెలిచిన వారికి మంచివి.. ఓడిన వారికి చెడ్డవా?
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సునిల్ అరోరా మాట్లాడుతూ.. ‘తిరిగి పేపర్ బ్యాలెట్ల రోజులకు వెళ్లే ప్రసక్తే లేదు. మేం ఈవీఎంలనే కొనసాగిస్తాం. 2014 నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయి. కొందరు గెలిచారు. కొందరు ఓడిపోయారు. గెలిచిన వారికి ఈవీఎంలు మంచివే. ఓడిపోయిన వారు అవి సరిగా లేవని అంటారు’ అని వ్యాఖ్యానించారు.
అంతేగాక, ‘ఈవీఎంలేం ఫుట్‌బాల్ కాదు. దేశంలో రెండు దశబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. రాజకీయ పార్టీల డిమాండ్ల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీవీప్యాట్ యంత్రాలను కూడా తీసుకొచ్చాం’ అని సునిల్ అరోరా వివరించారు. ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు, వివాదాలను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలనే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.








