
న్యూఢిల్లీ: దైవ దర్శనానికి వెళుతూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు సజీవంగా దగ్ధమయ్యారు. తూర్పు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఫ్లెఓవర్పై ఆదివారం రాత్రి సంభవించిన ఈ అనూహ్య ప్రమాదంలో మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా దంపతులు దైవ దర్శనం కోసం ఆదివారం రాత్రి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అక్షర్ధామ్ ఆలయానికి బయల్దేరారు. వీరు ప్రయాణిస్తోన్నకారు.. అక్షరధామ్ ఫ్లై ఓవర్‌పైకి రాగానే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టడంతో…
తేరుకునేలోగానే క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టడంతో.. రంజన మిశ్రా ఇద్దరు కూతుళ్లు కారులోనే సజీవంగా దగ్ధమయ్యారు. కారును నడుపుతున్న ఉపేంద్ర మిశ్రా.. ముందు సీట్లో కూర్చొన్న మరో కుమార్తెను తీసుకొని బయటకు దూకేశారు.
వెనుక సీటులో కూర్చున్న భార్య, ఇద్దరు కూతుళ్లను కాపాడేందుకు మిశ్రా విఫలయత్నం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు కూడా మిశ్రాకు సాయంగా కారు డోర్లను తెరిచే ప్రయత్నం చేశారు. అయితే మంటల దెబ్బకు కారు దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు.
దీంతో ఉపేంద్ర మిశ్రా భార్య రంజన మిశ్రా, ఇద్దరు కూతుళ్లు కారులోనే దగ్ధమైపోయారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందగానే ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు.
కుటుంబ సభ్యులను కళ్లముందే పోగొట్టుకున్న ఉపేంద్ర మిశ్రా, ఆయన కుమార్తె కన్నీరుమున్నీరవడం చుట్టూచేరిన వారిని కూడా కంటతడి పెట్టించాయి.
సీఎన్జీ గ్యాస్ లీక్ కావడం వల్లే కారులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారులోంచి బయటికి దూకేసిన మిశ్రా, ఆయన కుమార్తెకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.








