ఆదుకున్న ముకేశ్.. ఎరిక్సన్‌కు రూ.550 కోట్లు చెల్లించిన అనిల్!

3:44 pm, Tue, 19 March 19
two-brothers-anil-and-mukesh

ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ మొత్తం మీద తన పరువు బజారున పడకుండా నిలుపుకున్నారు. గడువుకు ఒక్కరోజు ముందు స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ కంపెనీకి బకాయి పడ్డ మొత్తం చెల్లించి, జైలుశిక్ష నుంచి తప్పించుకున్నారు.

డబ్బు చెల్లించేందుకు ఈనెల 19 వరకు సుప్రీంకోర్టు అనిల్‌ అంబానీకి గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిధులు ఉన్నప్పటికీ ఎరిక్సన్‌కు బకాయిలు చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు ఆర్‌కామ్‌పై ఇటీవల మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే ఎగవేస్తున్నట్లు తమకు అర్థమవుతోందని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్‌ అంబానీకి ఫిబ్రవరిలోనే స్ట్రాంగ్ వార్నిగ్ కూడా ఇచ్చింది.

మార్చి 19వ తేదీలోపు ఎరిక్సన్ కంపెనీ బకాయిలు తీర్చకపోతే, ఆర్‌కామ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీతో పాటు దాని అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ఛైర్మన్‌ చాయా విరానీ, రిలయన్స్‌ టెలికాం ఛైర్మన్‌ సతీశ్‌ సేథ్‌లకు జైలుశిక్ష తప్పదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తమ్ముడు అనిల్‌ని.. అన్న ముకేశ్ అంబానీయే అదుకున్నారు.

దీంతో సోమవారం సాయంత్రం ఆర్‌కామ్‌ నుంచి రూ.550 కోట్లు ఎరిక్సన్‌కు చేరాయి. గతంలో ఆర్‌కామ్ రూ.118 కోట్లు ఎరిక్సన్ కంపెనీకి చెల్లించింది. తాజా చెల్లింపుతో బకాయిలు పూర్తిగా తీర్చినట్లయింది. అన్న ముకేశ్ అంబానీ ఆర్థిక సాయం చేయడం వల్లే అనిల్ అంబానీ గట్టెక్కగలిగారు.

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఇబ్బందికర పరిస్థితుల్లో తనకు అన్నా వదినలు తోడుగా నిలిచారంటూ.. అన్న ముకేశ్ అంబానీ, వదిన నీతా అంబానీలకు.. అనిల్ కృతజ్ఞతలు తెలిపారు.

ఎరిక్సన్‌తో ఇదీ వివాదం…

ఆర్‌కామ్‌ నెట్‌వర్క్‌ను ఏడేళ్లపాటు నిర్వహించేందుకు 2013లో ఎరిక్సన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం మేరకు ఆర్‌కామ్ తమకు నిధులు చెల్లించడం లేదని, రూ.1600 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయంటూ ఎరిక్సన్‌ దివాలా కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ), అక్కడ్నించి మళ్లీ సుప్రీం కోర్టుకు చేరింది. అనిల్ అంబానీ ఛైర్మన్‌గా ఉన్న ఆర్‌కామ్ కంపెనీ బకాయిలు చెల్లించడానికి వీలుగా సుప్రీం కోర్టు రెండుసార్లు(2018 సెప్టెంబరు 30, డిసెంబరు 15) గడువు ఇచ్చింది.

అయినా ఆర్‌కామ్‌ బకాయిలు చెల్లించలేదు. దీంతో ఎరిక్సన్‌ కంపెనీ కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనిల్ అంబానీకి వార్నింగ్ ఇస్తూ.. బకాయిలు చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.

ఇక జియోతో ఒప్పందం కూడా రద్దు…

ఆస్తులు అమ్మి అయినా అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో అనిల్ అంబానీ నేత‌ృత్వంలోని ఆర్‌కామ్ 15 నెలల క్రితం ముకేశ్ అంబానీ అధినేతగా ఉన్న రిలయన్స్ జియోతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆర్‌కామ్‌కు దేశ, విదేశాలకు చెందిన 40 సంస్థలు రుణాలిచ్చాయి. 45 సమావేశాల తరవాత కూడా ఆస్తుల విక్రయానికి వారి నుంచి అనుమతి రాలేదు.

మరోవైపు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ).. ఆర్‌కామ్‌, రిలయన్స్‌ టెలికాం, ఆర్‌ఐటీఎల్‌ కంపెనీల ఆస్తులు విక్రయించరాదంటూ ఫిబ్రవరి 4న ఆదేశాలిచ్చింది. దీంతో ఇటు ప్రభుత్వంతోపాటు అటు రుణ దాతల నుంచి కూడా అనుమతులు రావడంలో తీవ్ర జాప్యం జరిగిన నేపథ్యంలో ఆర్‌కామ్.. జియోతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.