

జైసల్మేర్: ఫేస్‌బుక్‌లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరబ్బా అనుకుని ఓపెన్ చేసి చూస్తే.. ఆకుపచ్చని చీరలో అందంగా నవ్వుతూ ఉన్న ఓ యువతి ప్రొఫైల్ ఫోటో కనిపించింది. పేరు అనికా చోప్రా. హోదా.. ఇండియన్ ఆర్మీలో కెప్టెన్. ఇంకేముంది.. మన లైనేలే అనుకుని బోలెడు మంది భారత జవాన్లు ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసేశారు. అలా అనికా చోప్రా ఓ 50 మంది వరకు జవాన్లను తన ‘ప్రెండ్షిప్’ ముగ్గులోకి లాగింది.
సోమ్‌వీర్ సింగ్ అనే జవాను అందరికన్నా మరో అడుగు ముందుకేశాడు. 2016లో అనికా చోప్రా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో అతడు యాక్సెప్ట్ చేసి ఆమెతో స్నేహం చేశాడు. అప్పటికే అతడికి పెళ్లయింది కూడా. అయినా అనికాతో పరిచయం కొనసాగించాడు.
పరిచయం అయిన కొత్తలోనే ఇద్దరూ పరస్పరం తమ వ్యక్తిగత వివరాలు పంచుకున్నారు. ఇద్దరి మధ్యా చిగురించిన స్నేహం చివరికి ఏ స్థాయికి చేరిందంటే.. ఒకానొక దశలో తన భార్యకు విడాకులు ఇచ్చి అనికాను వివాహం చేసుకోవాలని కూడా సోమ్‌వీర్ సింగ్ భావించాడు.
రోజూ ఫోన్‌లో ఆమెతో మాట్లాడేవాడు. ఓసారి మాటల సందర్భంలో ‘‘మీ మిలటరీ ట్యాంక్ ఫొటోలు పంపించవా.. చూస్తాను..’’ అని అనికా అడగ్గా అతడు ఏమాత్రం ఆలోచించకుండా ఫొటోలు ఆమెకు పంపించాడు. అలాగే జైసల్మేర్‌లోని ఆర్మీ స్థావరంలో జరిగే కార్యకలాపాలకు సంబంధించిన పలు చిత్రాలను కూడా అతడు అనికా చోప్రాతో పంచుకున్నాడు.
వారి మధ్యన స్నేహం చివరికి దేశ భద్రతకు సంబంధించిన నిగూఢ రహస్యాలను కూడా పంచుకునే స్థాయికి చేరిందంటే అనికా ఎంత చాకచక్యంగా ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు.
పదే పదే ఫోన్ కాల్స్ మాట్లాడుతుండడంతో…
అయితే ఐదు నెలలుగా జవాన్ సోమ్‌వీర్ సింగ్ పదే పదే ఒక నంబర్‌కు ఫోన్ కాల్స్ చేస్తూ గంటల తరబడి మాట్లాడుతుండడం మిలటరీ ఇంటెలిజెన్స్ దృష్టికి వెళ్లింది. అంతే తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. తీరా చూస్తే.. అనికా చోప్రా భారత సైన్యంలో కెప్టెన్ కానేకాదు. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆమె పాకిస్తాన్‌కు చెందిన మహిళా గూఢచారి.
ఫేస్‌బుక్ ద్వారా భారత జవాన్లతో పరిచయం పెంచుకుని మన దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో జవాన్ సోమ్‌వీర్ సింగ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్మీ అధికారులు.. మరోవైపు అనికాతో ఫేస్‌బుక్ ఫ్రెండ్షిప్ సాగించిన మిగిలిన 50 మంది సైనికులను కూడా విచారించాలని నిర్ణయించారు.








