22 మంది మంత్రులు రాజీనామా! కర్ణాటకలో మైనారిటీలో పడిపోయిన కుమారస్వామి ప్రభుత్వం…

1:36 am, Tue, 9 July 19
karnataka-cm-kumara-swamy

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్-జేడీఎస్ అధికార కూటమికి చెందిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఒక్కసారిగా కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారు.

తాజాగా రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేశ్‌ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి నగేశ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే.. తాను ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్‌కు రాసిన లేఖలో నగేశ్ పేర్కొన్నారు.

కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణానికి మద్దతు తెలిపిన నగేష్.. కుమారస్వామి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూడా రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. నగేష్ ముల్బగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాజీనామా అనంతరం ఆయన ముంబైలో తిరుగుబాటు ఎమ్మెల్యేల క్యాంపునకు తరలివెళ్లినట్లు సమాచారం. అలాగే మరో మంత్రి, బీదర్‌ నార్త్‌ ఎమ్మెల్యే రహీమ్‌ ఖాన్‌ కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి సమాచారమిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల కోసం తమ పార్టీ మంత్రులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేయగా, స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్ సహా మొత్తం 22 మంది మంత్రులు రాజీనామా చేశారని మాజీ సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. వీరిలో 21 మంది కాంగ్రెస్ మంత్రులున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం వెనుక బీజేపీ జాతీయ నేతల హస్తం ఉన్నట్లు సిద్ధరామయ్య ఆరోపించారు.

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తుంటారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్‌ తీవ్రంగా విమర్శించారు.

వస్తే ఆహ్వానిస్తాం: బీజేపీ నేత స్పందన…

ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే.. తాను ఆ పార్టీకి మద్దతిస్తానంటూ గవర్నర్‌కు రాసిన లేఖలో స్వతంత్ర అభ్యర్థి నగేశ్ పేర్కొనడాన్ని బీజేపీ నేత శోభా కరంద్లజే హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీలోకి వచ్చేవారిని తాము స్వాగతిస్తామని చెప్పారు.

అయితే ఇప్పటి వరకు రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీ నాయకులను కలవలేదని, సంప్రదింపులు జరపలేదని.. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది కాబట్టి తక్షణమే కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా మరో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

శరవేగంగా మారుతోన్న పరిణామాలు…

మరోవైపు, కర్ణాటకలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కర్ణాటక సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వరతో భేటీ అయి.. అనంతరం ఇద్దరూ రాజ్‌భవన్‌కు తరలి వెళ్లారు.

ఒకవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించి తిరిగి దారిలోకి తెచ్చుకునేందుకు సీఎం కుమారస్వామి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం సీఎం కుమారస్వామిని మరింత సంక్షోభంలోకి నెట్టివేసింది. నగేశ్ బీజేపీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.