ys-jagan-pylan-ichapuram

ఇచ్ఛాపురం: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టినప్రజా సంకల్ప యాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమం కోసం వైసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇచ్ఛాపురం సమీపంలో పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

తన పాదయాత్ర ముగింపు సభలో వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారన్న విషయమై ఇటు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, స్థానిక, రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలేకాక అటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు…

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైఎస్ కుటుంబానికే దక్కుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా అధికారంలోకి రాగా ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట ఓదార్పు యాత్ర, ఆ తరువాత ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించారు.

జగన్ అరెస్టయి జైలులో ఉన్న తరుణంలో ఆయన చెల్లెలు షర్మిల జగన్ పాదయాత్రను కొనసాగించారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కినట్లయింది.

నాడు తండ్రి.. నేడు తనయుడు…

2004లో అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలుత రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఊరూరా తిరిగారు. తనను కలిసి సమస్యలు వివరించిన ప్రతి ఒక్కరికి సమస్యలు తీరుస్తానంటూ ఆయన భరోసా కల్పించారు. అప్పటికే తొమ్మిదేళ్లపాటు టీడీపీ పాలనతో విసిగి ఉన్న జనం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.

ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2004లో ఆయన చేసిన పాదయాత్ర ప్రజల్లో ఆయనపై ఎనలేని నమ్మకం కలిగించింది.

తండ్రి హఠాన్మరణంతో…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని తొలుత అందరూ భావించారు. అయితే తదనంతరం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం చకచకా జరిగిపోయాయి.

వైఎస్ మరణానంతరం ‘ఓదార్పుయాత్ర’ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. మళ్లీ 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో మరోసారి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఊరూరా తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

341 రోజులపాటు ప్రజలతో మమేకమై…

అలా 341 రోజులపాటు రాష్ట్రంలోని 134 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించిన జగన్ మొత్తం 3,648 కిలోమీటర్లు కాలినడక తిరిగారు. ఒక రాజకీయ నాయకుడు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత దేశంలో ఒక్క వైఎస్ జగన్‌కే దక్కిందనడంతో అతిశయోక్తి లేదంటారు రాజకీయ విశ్లేషకులు.

అంతేకాదు, ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కారణంగా టీడీపీకి అధికారం దక్కకుండా పోయిందని, మళ్లీ అదే కుటుంబం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర ప్రభావం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రంగా ఉండవచ్చని, 2004 ఫలితం రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

విమర్శలూ లేకపోలేదు…

వైఎస్ జగన్‌ పాదయాత్రపై అనేక విమర్శలు గుప్పించారు ప్రత్యర్థి పార్టీ నేతలు. ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి జగన్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి పాదయాత్ర పేరుతో వీధుల్లో తిరగడమేమిటంటూ పలువురు ఎద్దేవా చేశారు. అయినా వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. అంతేకాదు, జగన్ పాదయాత్రను వైసీపీ పూర్తిగా సమర్థించింది.

అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడల్లా స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తూ మైకును కట్ చేస్తున్నారని, అలాంటప్పుడు ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఎలా వినిపిస్తామంటూ ప్రశ్నించింది. ప్రజల సమస్యలు లేవనెత్తడానికి అసెంబ్లీయే అవసరం లేదని, ప్రజాసభలు నిర్వహిస్తూ కూడా ప్రజలను చైతన్య పరచవచ్చని, జగన్ ప్రస్తుతం అదే చేస్తున్నారని వైసీపీ శ్రేణులు పలుమార్లు ధ్వజమెత్తాయి.

అందుకే కాంగ్రెస్‌కు దగ్గరైన చంద్రబాబు?

ఒకవైపు అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్నా.. మడమ తిప్పకుండా వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రకు వచ్చిన అశేష స్పందన, ప్రభావంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ-టీడీపీ పొత్తు కూడా విచ్ఛిన్నమైందని, మరోవైపు ఆగర్భ శత్రువుగా భావించిన కాంగ్రెస్‌తో చంద్రబాబు చెలిమి కూడా ఆయన ప్రతిష్టను మసకబార్చిందనే వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ పాదయాత్ర దెబ్బతోనే…

కాంగ్రెస్‌తో తెలంగాణలో కుదుర్చుకున్న పొత్తు ఫలితాలు ఇవ్వకపోయినా.. జగన్‌ను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా మళ్లీ జనసేనకు దగ్గరయ్యేందుకు కూడా చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అంటున్నారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడానికి కూడా వైఎస్ జగన్ చేసిన పాదయాత్రే కారణమని, అప్పటి వరకు నాలుగేళ్లపాటు ప్రత్యేక ప్యాకేజీని ప్రమోట్ చేసిన చంద్రబాబు ఒక్కసారిగా మారిపోయి ప్రత్యేక హోదా నినాదాన్ని తన భుజాలపై వేసుకున్నారని, ఈ విషయంలో బీజేపీతో తెగదెంపులు చూసుకోవడానికి కూడా ఆయన వెనుకాడలేదంటే.. అదంతా జగన్ పాదయాత్ర ప్రభావమేనని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మొత్తానికి గత ఏడాది నవంబర్‌లో వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (జనవరి 9)తో ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి అక్కడే తన పాదయాత్రకు చిహ్నంగా పైలాన్‌ను ఆవిష్కరించి అనంతరం సాయంత్రం జరిగే బహిరింగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.


English Title:

ys jagans praja sankalpa yatra came to an end at ichapuram