

శ్రీకాకుళం: ఓ వైపు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే.. రైతులు, పేదలపై వరాలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురంలో బుధవారం ముగిసింది. ఈ పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని(పైలాన్) ఈ సందర్బంగా జగన్ ఆవిష్కరించారు.
అనంతరం, స్థానిక పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను మూడువేల కిలోమీటర్లకుపైగా నడవలేదని, ప్రజలే నడిపించారని అన్నారు. ప్రజలు, దేవుడి దయతో పాదయాత్ర పూర్తి చేశానని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘నిన్ను నమ్మం బాబూ..’ అని రైతులు అంటున్నారని విమర్శించారు. రైతులకు రెయిన్ గన్స్ ఇచ్చినట్టు డ్రామాలాడారని, రెయిన్స్ గన్స్ తో కరవును పారద్రోలానని చెప్పుకుంటున్న చంద్రబాబును రైతన్నలు నమ్మడం లేదని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని, నాబార్డు నివేదిక ప్రకారం ఏపీ రైతులు అప్పుల్లో రెండో స్థానంలో ఉన్నారని జగన్ తెలిపారు.
ఏపీలో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని, ఎక్కడా కొనుగోలు కేంద్రాలను తెరవలేదని, దళారీలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1750 కాగా, వెయ్యి రూపాయలు కూడా రైతుకు రాని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందని.. ఉన్న ఉద్యోగాలను కూడా తీసేయించారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.
డబ్బుపై వ్యామోహం లేదు..
తనకు డబ్బుపై ఎలాంటి వ్యామోహం లేదని, ప్రజలకు సేవ చేయాలన్నదే తన తపన అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కసారి అధికారంలోకొస్తే ముప్పై ఏళ్లు పాలించాలన్నది తన సంకల్పమని జగన్ పేర్కొన్నారు. చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉండాలనేదే తన కోరిక అని అన్నారు.
తాను పాదయాత్రలో మూడువేల ఆరువందల కిలోమీటర్లకుపైగా నడిచానని, తాను ప్రతీ పేదవాడి కష్టాన్ని దగ్గర్నుంచి చూశానని జగన్ చెప్పారు. పద్నాలుగు నెలలపాటు తాను పేదవాడితోనే ఉన్నానని, వారి అభివ్రుద్ది గురించే ఆలోచించానని చెప్పారు. పేదల పరిస్థితి మెరుగుపరుస్తానని, వారికి అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాను ప్రతి పేదవాడి సమస్యపైనా అవగాహనతో ఉన్నానని తెలిపారు.
రైతులకు వరాలు…
వైయస్ జగన్ తన ప్రసంగంలో రైతులకు, పేదలపై వరాలు కురిపించారు. రైతు బంధు, వైయస్ఆర్ రైతు బీమాను అందిస్తామని ప్రకటించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు అప్పులతో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడిసాయం అందిస్తామని ప్రకటించారు.
3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని, మద్ధతు ధర కల్పిస్తామని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏ పంటను ఎంతకు కొంటామో ముందే ప్రకటిస్తామని చెప్పారు. దళారీ వ్యవస్థ మోసాలు నిర్మూలిస్తామని, ప్రతీ మండలంలో కోల్ట్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు ఇస్తామని చెప్పారు. రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. తుఫాన్ల వల్ల కూలిపోయిన ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.3వేలు పరిహారం, జీడి పంటకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
రైతులకు పెట్టుబడిసాయంతో పాటు రైతు బీమా కూడా కల్పిస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతు చనిపోతే వైయస్సార్ బీమా కింద రూ.5 లక్షలు చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. ఆ బీమా డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. రైతు చనిపోయిన తర్వాత వచ్చే బీమా సొమ్ము మీద ఆ కుటుంబానికి తప్ప మరెవరికీ అధికారం లేకుండా తొలి శాసనసభ సమావేశాల్లో చట్టం తీసుకొస్తామని జగన్ ప్రకటించారు.
యాత్ర ముగిసింది.. పోరాటం కొనసాగుతుంది
‘ఈ ప్రజాసంకల్ప యాత్ర ఇంతటితో ముగిస్తున్నా.. ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది’ అని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో ఎన్నికలు రావడానికి మరో మూడు నెలల కాలం ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని కోరారు.
ఎందుకంటే, చంద్రబాబునాయుడు వంటి నారా రాక్షసుడితోనే కాదు మనం యుద్ధం చేసేది, ఈ చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా ఉందని, వ్యవస్థ మేనేజ్ చేసే పరిస్థితులు ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు పత్రికలు, ఈ పెద్ద మనిషికి తోడుగా ఉన్న అనేక ఛానెల్స్ తో కూడా యుద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజలు తన వైపు ఉంటే ప్రజా ప్రభుత్వమే వస్తుందన్నారు.








