చెన్నై: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెన్నై పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి అంటూనే… ఆయనపై సెటైర్లు వేశారు.
చంద్రబాబు ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని, అసలు చంద్రబాబుతో ప్రయాణమే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలలో రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండానే తాను ఆ పార్టీకి మద్దతు ప్రకటించానని, కానీ అ పార్టీ నుండి ఏమీ లాభం జరగలేదని విమర్శించారు.
జాతీయ రాజకీయాల్లో ప్రస్తతం మూడో కూటమి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్న పవన్… మహాకూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్ఫలితాలను ఇవ్వవని పేర్కొన్నారు.
‘ఎల్లారుకుం వణక్కం’ అంటూ…
చెన్నైలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బుధవారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ఎల్లారుకుం వణక్కం’ అంటూ తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పేరు పవన్ కల్యాణ్ అని, 2014లో జనసేన పార్టీని ప్రారంభించానని చెప్పారు. ఇరవై ఏళ్లు చెన్నైలో ఉన్నానని, తన తమిళంలో ఏవైనా తప్పులుంటే క్షమించాలని కోరారు.
పొరుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ గొంతుకను వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో మార్పు రావాలని, దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జల్లికట్టు గురించి పవన్ ప్రస్తావించారు. ఈ క్రీడ కోసం తమిళులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, యువత ముందుకొస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలదో చెప్పడానికి ఈ పోరాటమే నిదర్శనం అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌పైనా…
ఆంధ్ర విభజన సమస్యలపై మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను పవన్ గుర్తుచేశారు. అసలు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న విధానాలు కూడా సరైనవి కావన్నారు. ఎన్నో ఆశలతో ఏపీలో చంద్రబాబును సమర్థించాం కానీ, ప్రస్తుతం అక్కడి టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఉత్తరాది ఆధిపత్యంపై దక్షిణాదిలో ఉద్యమం రావాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.