

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోమవారం రాత్రి పొద్దుపోయాక టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రరెడ్డితో కలసి ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.
కోట్ల పార్టీ మారతారని వస్తున్న పుకార్లకు ఈ భేటీతో తెరపడినట్లయింది. సూర్యప్రకాష్‌రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకే కోట్ల తన కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబుతో సమావేశమైనట్లు సమాచారం. సూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలు ఎంపీ టిక్కెట్‌తో పాటు.. ఒక అసెంబ్లీ టిక్కెట్‌ను కూడా ఆశిస్తున్నట్టు తెలిసింది.
ఆయన బుధవారం కర్నూలు జిల్లాలో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించనున్నారు. తన కుటుంబసభ్యులు, మద్దతుదారులతో కలసి ఫిబ్రవరి 6న టీడీపీలో చేరే అవకాశమున్నట్టు సమాచారం. కాగా, కర్నూలు జిల్లా టీడీపీలోని మెజార్టీ నేతలు కోట్ల రాకను స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తుండటం గమనార్హం.
కోట్ల చేరికపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక అంశంపై ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కోట్ల – చంద్రబాబు భేటీపై కేఈ స్పందించారు. కోట్ల టీడీపీలో చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అంతేగాక, ఈ విషయమై తనతో ఎవరు కూడా సంప్రదించలేదని చెప్పారు. తనకు సమాచారం ఇచ్చారన్న వార్తల్లో నిజం లేదన్నారు.








