నారాలోకేష్ కి ఎదురుదెబ్బ.. మా కులస్తుడికి ‘మంగళగిరి’ టికెట్ ఇవ్వాల్సిందే..లేదంటే చిత్తుచిత్తుగా ఓడిస్తాం..

naralokesh

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ కు చేనేత కులసంఘాలు షాక్ ఇచ్చాయి. మంగళగిరిలో బీసీ అభ్యర్థులను నిలబెట్టిన పార్టీకే మద్దతు ఇస్తామని ప్రకటించాయి.

రాజకీయ పార్టీలు 175 నియోజకవర్గాల్లో ఒక్క చేనేత అభ్యర్థిని కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు జిల్లాలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కులసంఘాల నేతలు మాట్లాడారు.

రేపు దుకాణాలు మూసేసి, భారీ ర్యాలీకి నిర్ణయం

రాజకీయ పార్టీలన్నీ మంగళగిరి టికెట్ ను బీసీ చేనేత అభ్యర్థులకు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే ఆయా పార్టీల అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల వ్యవహారశైలికి నిరసనగా రేపు గుంటూరులో దుకాణాలు మూసేసి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు.

బీసీ వర్గాలను కలుపుకుని రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా మంత్రి నారా లోకేశ్ ను ఖరారు చేయగా, వైసీపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పోటీకి దించాలా? లేక బీసీ సామాజికవర్గానికి చెందిన ఉడుతా శ్రీనుకు టికెట్ ఇవ్వాలా? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.