ఢిల్లీ: ప్రధాని మోడీపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీలకి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
ప్రియాంకా విమర్శలు…సుష్మా కౌంటర్…
మంగళవారం హర్యానాలో జరిగిన ఓ ప్రచార సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి మహాభారతంలో దుర్యోధనుడికి ఉన్నంత అహంకారం ఉందని విమర్శించారు. ఈ దేశం అహంకారులను ఎట్టిపరిస్థితిలోనూ క్షమించదని.. కచ్చితంగా ఈసారి మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
చదవండి: ‘థాంక్యూ బేటా..’: ప్రసంగం మధ్యలో.. చిన్నారికి థాంక్స్ చెప్పిన మోడీ, ఏం జరిగిందంటే…
ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుష్మా స్వరాజ్… అసలు అహంకారి అంటే రాహుల్ గాంధీయేనంటూ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా 2013లో జరిగిన ఓ సంఘటనను ఆమె ప్రస్తావించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నాటి యూపీఏ సర్కారు జారీ చేసిన ఓ అత్యవసర ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చింపివేశారని విమర్శించారు.
అసలు రాష్ట్రపతి ఆమోదముద్రవేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చింపివేసి అప్పటి ప్రధానిని అవమానించారని అన్నారు. అది.. అసలు అహంకారం అంటే. మీరు మాకు చెబుతున్నారా?’’ అంటూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
మోడీపై మమత ఫైర్…మమతపై సుష్మా ఫైర్…
ఇటీవల మోడీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమత…తాను చాలామంది ప్రధానులను చూశానని, కానీ మోదీ అంత అబద్ధాలకోరును ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన మళ్లీ ఎన్నికైతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందని, కాబట్టి మోదీకి ప్రజాస్వామ్యం చెంపదెబ్బ రుచి చూపించాల్సిన అవసరముందని మమత పేర్కొన్నారు.
ఇక మమత వ్యాఖ్యలకు సుష్మా కౌంటర్ ఇచ్చారు. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మోదీ దేశానికి ప్రధానమంత్రి అని… రేపు మీరు ఆయనతో మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. ఎప్పుడూ ద్వేష భావంతోనే ఉండటం ఎందుకని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు మనం మళ్లీ స్నేహితులం కావాల్సిందే అని తెలిసినా ఇలా ప్రవర్తించడానికి సిగ్గుపడటం లేదా? అని తీవ్రంగా స్పందించారు.
చదవండి: అయ్యో…బీజేపీ అభ్యర్ధి సన్నీ డియోల్‌కి ఆ విషయం కూడా తెలియదంటా…





