
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ఆరో దశ పోలింగ్ ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 80.16% పోలింగ్ నమోదు అవగా… ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యల్పంగా 53.27% పోలింగ్ నమోదైంది. అలాగే బీహార్‌లో 59.29% , హరియాణాలో 62.91%, మధ్యప్రదేశ్‌లో 60.40%, జార్ఖండ్‌లో 64.46%, ఢిల్లీలో 60 శాతం పోలింగ్ నమోదైంది.
చదవండి: మళ్ళీ చిక్కుల్లో పడ్డ సిద్ధూ…
ఇక 59 స్థానాల్లో బరిలో నిలిచిన 979 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ, గౌతమ్ గంభీర్, రీటా బహుగుణ జోషి, దిలీప్ ఘోష్, మీనాక్షి లేఖి, కాంగ్రెస్ తరఫున దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, విజేందర్ సింగ్, షీలా దీక్షిత్, ఎస్పీ నుంచి అఖిలేశ్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
బెంగాల్‌లోని హల్దియా, తమ్లుక్ నియోజకవర్గాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయని ఈసీ వర్గాలు తెలిపాయి. ఇక అదే రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్‌పై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. యూపీలోని ఫూల్పూర్‌లో ఎస్పీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.





