కడుపారా బ్రేక్‌ఫాస్ట్‌.. గుండె జబ్బులు బలాదూర్!

heavy breakfast, breakfast daily, Newsxpressonline

హైదరాబాద్: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినడం కొందరికి అలవాటు. రోజూ ఉదయం పూట నాలుగు ఇడ్లీలుగాని, ఒక దోశగాని, లేదంటే రెండు పూరీలుగాని, కొద్దిగా ఉప్మాగాని తినడం చాలామందికి అలవాటు. అయితే మరికొందరు బ్రేక్‌ఫాస్ట్ అసలు తీసుకోరు. ఆ సమయంలో టీ, కాఫీతో సరిపుచ్చేస్తుంటారు. కానీ ఇది చాలా తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రతి ఒక్కరూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలట. అది కూడా కొద్దిగా కాదు.. కడుపారా! అంటే.. మీరు ఎంత తినగలిగితే అంత. అంతేకాదు, మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌‌లో సాధ్యమైనంత వరకు అన్ని పోషకాలూ ఉండేలా చూసుకోమని కూడా న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇలా అధిక మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం గుండెకు చాలామంచిదని, ఎన్నోరకాల గుండె జబ్బులు దరిచేరవని తాజా అధ్యయనాల్లో తేలింది.

ఓ రెండు వేలమంది నిత్యం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు.. పరిశీలించిన శాస్త్రవేత్తలు చివరికి ఈ విషయాన్ని తేల్చారు. నిత్యం మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి లభించే క్యాలరీల్లో 5వ వంతు క్యాలరీలు ఉదయం పూట తీసుకునే ఒక్క బ్రేక్‌ఫాస్ట్ ద్వారా లభిస్తే చాలా మంచిదని, దీనివల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో కనుగొన్నారు.

ఇక ఉదయంపూట బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుండా మానేసే వారికి గుండె జ‌బ్బుల ముప్పు అధికంగా ఉంటుంద‌ని, బ్రేక్‌ఫాస్ట్ తినే వారి క‌ంటే తిన‌ని వారికే 15 శాతం ఎక్కువ‌గా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని తమ తాజా అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాబట్టి ఎవ‌రైనా సరే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ నిత్యం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందేన‌ని, ఉదయం పూట అల్పాహారం మాన‌కూడ‌ద‌ని, అది కూడా కడుపారా తినాలని, సాధ్యమైనంత వరకు బ్రేక్‌ఫాస్ట్ల్‌లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలని వారు చెబుతున్నారు.