మీకు పొట్ట ఎక్కువగా ఉందా ? అయితే విటమిన్-డి లోపం ఉన్నట్లే. ఈ విషయం మేం చెప్పడం లేదు. శాస్త్రవేత్తల తాజా పరిశోధన చెబుతోంది. అవును, పొట్ట ఎక్కువగా ఉన్న వారిలో విటమిన్-డి తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెదర్లాండ్స్ ఎపిడెమియాలజీ ఆఫ్ ఒబెసిటీ స్టడీ నుంచి వీయూ యూనివర్సిటీ మెడికల్ సెంటర్, లెయిడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు డేటాను సేకరించారు. ఆ డేటాలో ఉన్న అనేక అంశాలను పరిశోధకులు పరిశీలించారు.
45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు, స్త్రీలలో ఉదర భాగంలో కొవ్వు అధికంగా ఉన్న వారిలో విటమిన్-డి లోపం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇలా ఉదర భాగంలో కొవ్వు అధికంగా ఉన్న వారు విటమిన్-డి పరీక్ష చేయించుకుని.. లోపం ఉంటే తగిన మందులను వాడడం లేదా విటమిన్-డి ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఉదర భాగంలో కొవ్వును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
సాధారణంగా మనకు విటమిన్-డి అనేది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. రోజూ ఉదయాన్నే 20 నిమిషాల పాటు మన దేహానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే శరీరంలో చర్మం కింద ఉండే కొవ్వులో విటమిన్-డి తయారవుతుంది. ఈ విటమిన్-డి మన శరీరంలోని ఎముకలకు, కండరాలకు అవసరం. అలాగే ఎముకల పెరుగుదలకు అవసరమయ్యే కాల్షియం స్థాయిలను కూడా ఈ విటమిన్-డి నియంత్రిస్తుంది. కనుక విటమిన్-డి అనేది మనకు చాలా అవసరం. ఇంకా పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, అవకాడో, గుడ్లు, నట్స్, చేపలు, నెయ్యి, క్యారెట్ తదితర ఆహార పదార్థాలను తినడం ద్వారా కూడా విటమిన్-డి మన శరీరానికి లభిస్తుంది.