వేసవిలో సబ్జాగింజలతో కలిగే లాభాలేమిటో తెలుసా?

- Advertisement -

ఎండ‌లు మండిపోతున్నాయి. బ‌య‌ట కాలు పెట్టాలంటేనే జంకాల్సిన ప‌రిస్థితి నెలకొంది. అధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా బ‌య‌ట తిర‌గాలంటే జ‌నాలు వెనుక‌డుగు వేస్తున్నారు. దీనికి తోడు అధిక వేడి, జ్వ‌రం, చెమ‌ట‌కాయ‌లు.. త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి స‌మ‌స్య‌లున్న‌వారే కాక ఎవ‌రైనా ఈ సీజ‌న్‌లో స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవాలి. వాటిని నాన‌బెట్టి జెల్ గా మారాక తింటే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతాయి. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగాఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

2. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో నిమ్మరసం, చ‌క్కెర వేసి కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో స‌బ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

3. బరువు తగ్గాలనుకునే మహిళలు సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగాలి. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని రాత్రి నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీబయాటిక్‌లాగా పని చేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరుసటి రోజుకు శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు… సబ్జా గింజల నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోపాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

4. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

5. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగి ఉంటాయి.  సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది.

6. సబ్జా గింజ‌లు వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికారక టాక్సిన్లు క‌డుపులోకి చేరకుండా చేస్తాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే.. శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

- Advertisement -