ఉత్తరకొరియాకు షాకిచ్చిన అమెరికా! సింగపూర్ సమావేశం రద్దు, కిమ్ తీరా ఆ పని చేశాక…

- Advertisement -

ప్యాంగ్‌యాంగ్:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట తప్పి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు పెద్ద షాకే ఇచ్చారు.   జూన్‌ 12న ఇరు దేశాధినేతల మధ్య సింగపూర్‌లో జరగనున్న సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  ఇందుకు ఉత్తరకొరియా నియంత కిమ్‌నే తప్పుబట్టారు ట్రంప్.  అమెరికా పట్ల కిమ్ బహిరంగంగానే శత్రుత్వం ప్రదర్శిస్తున్నారంటూ ట్రంప్ ఆరోపించారు.

మరోవైపు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన మాట నిలబెట్టుకున్నారు.  అమెరికా-ఉత్తరకొరియా నడుమ చర్చల నేపథ్యంలో గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడిన కిమ్ తన దేశంలోని అణు పరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేశారు. అంతర్జాతీయ జర్నలిస్టుల సమక్షంలో గురువారం పంగీ రీ అణు పరీక్ష కేంద్రాన్ని, టన్నెల్స్‌ను ఉత్తరకొరియా పేల్చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కిమ్‌ను కలవడం లేదంటూ ట్రంప్‌ ప్రకటించారు.

అంతేకాదు, ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు ఒక లేఖ రాశారు.   వచ్చే నెల 12న సింగపూర్‌లో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ లేఖలో ప్రకటించారు.  పైగా శాశ్వత శాంతి, సౌభాగ్యాలను సాధించగలిగే మహోన్నత అవకాశాన్ని ఉత్తర కొరియా కోల్పోయిందని ట్రంప్ ఆ లేఖలో  పేర్కొన్నారు.

అయితే అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై ఉత్తరకొరియా అధినేత నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మరోవైపు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కూడా హెచ్చరించారు. ఉత్తర కొరియా కూడా లిబియాలానే అవుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే మైక్‌ పెన్స్‌ వ్యాఖ్యలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -