
లాహోర్: జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపురలో జరిగిన ఉగ్రదాడిపై ఎట్టకేలకు పాకిస్తాన్ స్పందించింది. దాడి జరిగిన ఐదు రోజులకు దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరువిప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమను నిందిస్తోందని, అసలు ఈఉగ్రదాడితో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.
అంతేకాదు, ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నది పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదులన్న సాక్ష్యాలు భారత్ వద్ద ఉంటే చూపించాలని, కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తామూ ఉగ్రవాద బాధితులమేనని, ఉగ్ర కార్యకలాపాలతో ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని వ్యాఖ్యానించారు.
అలాగే ఉగ్రవాదంపై చర్చలకు పాక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో భారత్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని అన్నారు.
కశ్మీర్ సమస్య సైనిక చర్యతో పరిష్కారం కాదని, చర్చలతోనే ఈ వివాదాన్ని పరిష్కరించవచ్చని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్ తమ దేశంపై సైనిక చర్యకు దిగాలని భావిస్తే.. దానిని తాము దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. భారత్‌లో ఇది ఎన్నికల ఏడాది గనుకనే ఈ ఉగ్రదాడి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే పాక్‌ను నిందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.








