
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు. ఆగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసినా కుక్క తోక వంకర చందంగానే ఆ దేశం వ్యవహరిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి వెనుక జైషే మహ్మద్ హస్తం ఉందంటూ నిర్దిష్ట ఆధారాలు భారత్ అందజేసినా.. పాకిస్తాన్ మళ్లీ పాత పాటే పడుతోంది.
భారత్ అందజేసిన ఆధారాల ప్రకారం తాము దర్యాప్తు జరిపామని, అయితే ఆ ప్రాంతాల్లో అసలు ఉగ్రవాద శిబిరాలే లేవని చెబుతోంది. నమ్మకం లేకపోతే భారత అధికారులు వచ్చి చూసుకోవచ్చంటూ పెడసరంగా సమాధానమిస్తోంది.
చదవండి: భారత్ తరుపున ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకి దిగొచ్చిన పాక్!
ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని అవంతిపుర వద్ద సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోన్న జైషే మహ్మద్ సంస్థ హస్తముందంటూ భారత్ ఆరోపించింది. పుల్వామా దాడి అనంతరం జేషే మహ్మద్ కూడా అది తమ పనే అంటూ స్వయంగా ప్రకటించుకుంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం దీనిని నమ్మడం లేదు.
పుల్వామాలో ఆత్మాహుతి దాడి అనంతరం భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసుకున్న సంస్థలపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది.
ఈ దాడికి సంబంధించిన కీలక పత్రాలను కేంద్రం ఫిబ్రవరి 27న ఢిల్లీలోని పాకిస్తాన్ తాత్కాలిక హైకమిషనర్‌కు కూడా అందజేసింది. ఉగ్రదాడికి ముందు ఉగ్రవాదుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మొబైల్ సమాచారాన్ని నెంబర్లతో సహా అందజేసింది. మొత్తం 22 ప్రాంతాల్లో 90 మందిని అనుమానితులుగా భారత్ పేర్కొంది.
‘‘మేం చెప్పలా.. అసలక్కడ ఉగ్రవాద శిబిరాలే లేవు..’’
ఆ వెంటనే పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా దీనిపై విచారణకు ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించింది. పుల్వామా దాడి ఘటన వ్యవహారంపై అనేక మందిని అదుపులోకి తీసుకుని తాము విచారించామంటూ పాక్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా తెలిపింది. చివరికి వచ్చేసరికి.. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ తేల్చేసింది.
చదవండి: ‘అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్’: మళ్లీ అడ్డుకున్న చైనా, అమెరికా వార్నింగ్
ఈ విషయమై పాకిస్తాన్ విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటన చేస్తూ.. ‘‘భారత్ అందజేసిన పత్రాల్లో పేర్కొన్న 22 ప్రాంతాల్లో తాము విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని, అయితే అసలక్కడ ఉగ్రవాద శిబిరాలే లేవని తెలిపింది. తాము 54 మంద అనుమానితులను విచారించామని, పుల్వామా ఉగ్రదాడిలో వారి పాత్ర ఉన్నట్లు ఎలాంటి రుజువులు తమకు లభించలేదని పేర్కొంది.
అంతేకాదు, ఒకవేళ తమ దర్యాప్తుపై భారత్‌కు అనుమానం ఉంటేగనుక, ఓ అధికారుల బృందాన్ని పంపించి ఆయా ప్రాంతాల్లో స్వయంగా పరిశీలన జరిపించుకోవచ్చని, ఇందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది.








