

నార్వే: కొన్ని గంటలు సూర్యుడు ఉంటే, మరి కొన్ని గంటలు చంద్రుడు ఉంటాడు. ఒక్క అమావాస్య రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు. కానీ ఆ ఊళ్లో చంద్రుడు ఉన్నా సూరీడు దెబ్బకి అస్సలు కనిపించడు. అసలు సూర్యుడు కనుమరుగైతే కదా చంద్రుడు ప్రకాశించడానికి. 24 గంటలు సూర్యుడు ఆ ఊరిని వెంటాడుతూనే ఉంటాడు, ప్రతి రోజు కాదండోయ్, కేవలం కొన్ని నెలలే.
నార్వే దేశం లోని ‘లాంగియర్‌బెన్’ అనే ఊళ్ళో నాలుగు నెలల పాటు సూర్యుడు 24 గంటలు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఏప్రిల్ 20 నుంచి ఆగస్టు 22 వరకూ ఇరవై నాలుగు గంటలూ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. అసలు ఆ నాలుగు నెలలూ పగటికి రాత్రికి తేడానే ఉండదు. సూర్యుడి ప్రతాపానికి చీకటి అనే మాటే ఉండదు ఆ నాలుగు నెలలు, కానీ ఆ తరువాత అంతా చీకటే చీకటి.
‘లాంగియర్‌బెన్’ గ్రామంలో నాలుగు నెలల పాటు చిమ్మ చీకటి ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా మొత్తం చీకటే, సూర్యుడి జాడ ఈ నాలుగు నెలలు కనిపించదు. జనం చీకట్లోనే ఈ 4 నెలలు సావాసం చెయ్యాలి. ఇలా నాలుగు నెలలు వెలుగుని, నాలుగు నెలలు చీకటిని చూస్తూ వస్తున్నారు ‘లాంగియర్‌బెన్’ గ్రామంలోని ప్రజలు.
అక్కడొక్క చోటే కాదు…
ఇలా ఒక్క నార్వేలోనే కాదు, ఫిన్లాండ్ దేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో 24 గంటలు సూరీడు ఉంటాడు, కానీ ‘లాంగియర్‌బెన్’లో మాత్రమే ఎక్కువ నెలలు ఉంటాడు. వలయాకారంలో ఉన్న భూమికి ఉత్తర దిక్కున చిట్టచివరన ఉండే ప్రాంతమే ఈ ‘లాంగియర్‌బెన్’.








