భారతీయ ఐటీ నిపుణులకు డొనాల్డ్ ట్రంప్ తీపి కబురు.. హెచ్1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు!

donald trump
- Advertisement -

donald trump

వాషింగ్టన్‌: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా వలస విధానాలపై సానుకూలంగా స్పందించారు. ఆయనిచ్చిన తాజా భరోసా భారతీయులకు కచ్చితంగా తీపి కబురే. అమెరికాలో ఉద్యోగాల్లో కొనసాగడంతోపాటు అక్కడే పౌరసత్వాన్ని కూడా పొందడానికి మార్గం సుగమం చేసేలా హెచ్1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించడం గమనార్హం.

హెచ్1బీ వీసాదారులు ఇక అమెరికాలో నిశ్చితంగా ఉండొచ్చని, వారు ఉద్యోగాల్లో కొనసాగేందుకు కచ్చితమైన భరోసానిచ్చేలా సులభతర నిబంధనలు రాబోతున్నాయని ట్రంప్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా పౌరసత్వం పొందడానికి కూడా ఇవి దోహదపడతాయన్నారు.

అమెరికాలోని ఐటీ నిపుణుల్లో అత్యధికమంది భారతీయులే ఉన్న సంగతి తెలిసిందే. దశాబ్ద కాలంగా వారు అక్కడే పనిచేస్తున్నా… శాశ్వత నివాసం/పౌరసత్వం(గ్రీన్ కార్డ్) లేవు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వలస విధానాలపై కఠినంగా వ్యవహరించిన ట్రంప్.. క్రమంగా వారిపై సానుకూల దోరణిని చూపిస్తున్నారు.

మెరిట్‌-బేస్డ్‌ ఇమిగ్రేషన్‌ సిస్టం

ఈ క్రమంలోనే అత్యంత ప్రతిభావంతులను ప్రోత్సహించి, వారు అమెరికాలోనే ఉండేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మెరిట్‌-బేస్డ్‌ ఇమిగ్రేషన్‌ సిస్టం గురించి ఇటీవల ఆయన పదేపదే ప్రస్తావించారు కూడా.

కాగా, అత్యధిక వేతనాలతో పనిచేయదలచిన ప్రతిభావంతులకు హెచ్‌-1బి వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా పౌరసత్వ, వలస విభాగం ‘యూఎస్‌సీఐఎస్‌’ కూడా గత నవంబరులో ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే వీసా నిబంధనలను సడలించనున్నట్టు ట్రంప్‌ వెల్లడించడం గమనార్హం. ఆయన నిర్ణయం పట్ల భారతీయ నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

1 COMMENT

  1. దేవుడా.. ఎన్నాళ్లకి కరుణించావు ట్రంప్ తండ్రీ.. ఇక భారతీయ అమెరికన్ల కష్టాలు తీరినట్లే!