26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం శ్రీలంకలో మళ్లీ బాంబు పేలుళ్లు.. ఆరుగురు చిన్నారులు సహా 15 మంది మృతి

శ్రీలంకలో మళ్లీ బాంబు పేలుళ్లు.. ఆరుగురు చిన్నారులు సహా 15 మంది మృతి

- Advertisement -

కొలంబో: శ్రీలంక మళ్లీ బాంబు పేలుళ్లతో వణికింది. శుక్రవారం చీకటి పడిన తరువాత చోటుచేసుకున్న మూడు బాంబు పేలుళ్లలో ఆత్మాహుతి బాంబర్లు సహా మొత్తం 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. శ్రీలంక తూర్పు ప్రాంతమైన అంపరాయి జిల్లాలోని సైంథమరుతు, కల్మునై ప్రాంతాల్లో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

కల్మునై గ్రామంలో వద్ద పోలీసు బలగాలపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఒక భవనంలో సోదాలు జరుపుతుండగా ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతోపాటు ఆరుగురు చిన్నారులు కూడా మరణించారు. మరోవైపు కల్మునైలో భద్రతాబలగాలు విస్తృతంగా సోదాలు చేస్తున్నాయి.

బాంబు పేలుళ్లతో పట్టణంలో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. స్థానికులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక పాఠశాలలకు తరలించారు. అంపరాయి జిల్లాలోని సెన్నెల్ అనే మరో గ్రామంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ఇస్లామిక్ స్టేట్ నినాదాలు రాసిన బ్యానర్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్టు కూడా చేశారు.

ఆ ఇంటిని కట్టంకుడికి చెందిన ఒక వ్యక్తి అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. శ్రీలంక పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్‌గా పోలీసులు భావిస్తున్న జహ్రాన్ హషీమ్ స్వస్థలమే కట్టంకుడి. మరోవైపు బాంబు పేలుళ్ల కారణంగా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పది గంటల నుంచి శ్రీలంక అంతటా కర్ప్యూ విధించారు.

శనివారం ఉదయం 4 గంటల వరకూ ఈ కర్ప్యూ అమలైంది. ముఖ్యంగా కల్మునై‌, సైంథమరుతు, చవలకడై పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.

చదవండి:  శ్రీలంకలో పండుగపూట మారణహోమం….ఇది ఎవరి పని?
- Advertisement -