22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం ఉగ్ర ఘాతుకం: చర్చిపై బాంబుల దాడి.. 20 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

ఉగ్ర ఘాతుకం: చర్చిపై బాంబుల దాడి.. 20 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

church
- Advertisement -

church

జోలో: ఫిలిప్పీన్స్‌లో ఉగ్రవాదులు ఒక చర్చిపై బాంబు దాడికి తెగబడ్డారు. ఇందులో కనీసం 20 మంది చనిపోగా, వందమందికిపైగా గాయపడ్డారు. ఆదివారపు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ ఘాతుకం జరిగింది. నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగాయని అధికారులు వెల్లడించారు.

దక్షిణ ఫిలిప్పీన్స్ సులు ప్రావిన్స్‌లోని జోలో పట్టణంలో ఈ ఉగ్రదాడి చోటుచేసుకుంది. మొదటి పేలుడు చర్చిలోని ప్రధాన మందిరంలో చోటుచేసుకుంది. ఇందులో పలువురు చనిపోయారు. భయాందోళనకు గురైన ప్రజలు ప్రధాన ద్వారం గుండా బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. అదే సమయంలో చర్చి వెలుపల ఉన్న సైనికులు, పోలీసులు లోపలికి పరుగులు తీశారు. ఇంతలో ప్రధాన ద్వారం వద్ద రెండో బాంబు పేలింది. దీంతో మరికొందరు మృత్యువాతపడ్డారు.

రెండో బాంబును ఓ మోటారు సైకిల్‌లో అమర్చారన్న వార్తలు తెలుస్తోంది. బాంబు పేలుళ్ల తర్వాత సెల్‌ఫోన్‌ సంకేతాలను నిలిపివేశారు. మృతుల్లో పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఘటన అనంతరం సాయుధ శకటాల్లో భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. చర్చికి దారితీసే ప్రధాన రోడ్డును మూసేశాయి.

ఉగ్రదాడికి అదే కారణమా?

ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కార్యాలయం స్పష్టం చేసింది. రోమన్‌ క్యాథలిక్‌లు ఎక్కువగా ఉన్న ఫిలిప్పీన్స్‌లో ముస్లింలు మైనార్టీలుగా ఉన్నారు. కాగా, గత ఐదు దశాబ్దాల్లో 1.5 లక్షల మందిని బలిగొన్న వేర్పాటువాద ఉద్యమానికి ముగింపు పలికాలనే ఉద్దేశంతో ఇటీవల దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మైనార్టీల కోసం స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

ఇందుకు చాలావరకూ ముస్లిం ప్రాంతాలు ఆమోదం తెలిపినప్పటికీ సులు ప్రావిన్స్‌ మాత్రం తిరస్కరించింది. ఈ క్రమంలో చర్చిపై ఉగ్రదాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ బాంబు దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.

- Advertisement -