23.4 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం అజ్ఞాతవ్యక్తి ఉపాయం.. రోడ్డుపై గుంతలు మాయం

అజ్ఞాతవ్యక్తి ఉపాయం.. రోడ్డుపై గుంతలు మాయం

- Advertisement -

లండన్: రోడ్డుపై గుంతలు వాహనదారులను ఎంతగా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గుంతల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, సంబంధిత అధికారులు మాత్రం రోడ్లపై గుంతలను పూడ్చడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటారు. ఇంగ్లండ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడి మిడిల్స్‌బ్రో కౌన్సిల్‌లోనూ ఇదే నిర్లక్ష్యం. ఏడాది కాలంగా రోడ్లు గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారుల్లో చలనం లేదు. రోడ్లపై గుంతలను పూడ్చాలంటూ ఎంతోమంది ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక అధికారులకు ఫిర్యాదు చేసి లాభం లేదనుకున్న గుర్తు తెలియని వ్యక్తి (వ్యక్తులు) చక్కని ఉపాయం ఆలోచించాడు.

అంతే.. ఏడాది కాలంగా పట్టించుకోని అధికారులు ఆగమేఘాల మీద రోడ్లపై పడ్డారు. అప్పటికప్పుడు రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చివేశారు. దీంతో ఆశ్చర్యపోవడం జనాల వంతైంది. ఇంతకీ ఆ గుర్తు తెలియని వ్యక్తి (వ్యక్తులు) ఏం చేశారో తెలుసా? గుంతలున్న ప్రతి చోటా దాని చుట్టూ రంగులతో పురుషాంగం బొమ్మ గీశారు. ఇది కాస్తా వైరల్‌గా మారి, సోషల్ మీడియాలో ఫొటోలు వెల్లువెత్తడంతో స్పందించిన అధికారులు ఇక ఉపేక్షించి లాభం లేదని అప్పటికప్పుడు వాటిని పూడ్చివేశారు. ఏడాది కాలంగా పట్టించుకోని అధికారులను ఒక్క చిట్కాతో పరుగులు పెట్టించిన ఆ అజ్ఞాత వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. కాగా, 2015లోనూ ఇంగ్లండ్‌లో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. వాంక్‌స్కీ అనే స్ట్రీట్ ఆర్టిస్ట్ స్నేహితుడు రోడ్డు గుంతల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అధికారులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రోడ్డుపై ఉన్న గుంతల చుట్టూ పురుషాంగం బొమ్మలు వేసి నిరసన తెలిపి అధికారులు కళ్లు తెరిపించాడు.

- Advertisement -