తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం! మే 15లోపు కొత్త ఫలితాలు…

- Advertisement -

హైదరాబాద్: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకోకపోయినా.. ఫెయిలైన విద్యార్థులు అందరికీ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, వీటికోసం విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదని, మే 15లోపు కొత్త ఫలితాలను, కొత్త మార్కులను విద్యార్థుల ఇంటికే పంపుతామని వెల్లడించింది.

తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడి అనంతరం తీవ్ర గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో బోర్డు అధికారులు, సిబ్బంది తప్పిదాల్ల వల్ల ఉత్తీర్ణులు కాలేక.. తీవ్ర మనోవేదనకు గురై.. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి విదితమే.
మరోవైపు దీనిపై తల్లిదండ్రులు కూడా ఉద్యమించడం, వారికి విపక్షాలు కూడా మద్దతు పలకడంతో ఈ ఉద్యమం మరింత ఉధృతమైంది.

విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు, ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఇటు తల్లిదండ్రులతోపాటు అటు కాంగ్రెస్, జనసేన, విద్యార్థి, ఇతర సంఘాలు కూడా ధర్నాలు, ఆందోళనలకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వగా, జనసేన, బీసి సంఘం నేత ఆర్.క్రిష్ణయ్య ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఫలితాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడమేగాక తల్లిదండ్రుల కడుపుకోతకు కారకులైన వారిని గుర్తించి తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆయా పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిగివచ్చారు. గందరగోళ పరిస్థితులపై బుధవారం సమీక్షించిన అనంతరం ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్‌, రీ వాల్యుయేషన్ ను ఉచితంగా చేయాలని ఆదేశించారు. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా, గురువారం ఉదయం ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దరఖాస్తు చేసుకోకపోయినా.. ఫెయిలైన విద్యార్థులు అందరికీ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆ ఫీజును కూడా తిరిగి వాపస్ చేయనున్నట్లు పేర్కొంది.

అంతేకాదు, వీటికోసం విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదని, మే 15లోపు కొత్త ఫలితాలను, కొత్త మార్కులను విద్యార్థుల ఇంటికే పంపుతామని వెల్లడించింది.

చదవండి: ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ : సీఎం…
- Advertisement -