‘టిక్‌టాక్‌’కు భారీ ఊరట.. మధ్యంతర నిషేధాన్ని ఎత్తివేసిన మద్రాస్ హైకోర్టు

- Advertisement -

చెన్నై: దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అవడంతోపాటు బోల్డన్ని వివాదాలు కూడా మూటగట్టుకుని నిషేధానికి గురైన చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు భారీ ఊరట లభించింది.

భారత్‌లో ఏకంగా 54 మిలియన్ల మంది యూజర్లు ఉన్న ఈ యాప్‌కు అంతే సంఖ్యలో వివాదాలు చుట్టుముట్టాయి. యాప్ దుర్వినియోగమవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ల నుంచి తొలగించారు.

తాజాగా, మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనం టిక్‌టాక్‌పై ఉన్న మధ్యంతర నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, పోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్ చేయకూడదంటూ కొన్ని పరిమితులు కూడా విధించింది. ఈ విషయంలో వైఫల్యం చెందితే మాత్రం కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

పోర్నోగ్రఫీ వీడియోల కారణంగా టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించాలంటూ ఏప్రిల్ 3న కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

అయితే, అప్పటికే దీనిపై విచారణ జరుగుతుండటంతో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం అంగీకరించలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 18 నుంచి యాపిల్ స్టోర్‌, గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు.

నిషేధంపై టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ వాదనలు వినకుండానే కోర్టు మధ్యంతర నిషేధం విధించిందని, ఇది ముమ్మాటికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని వాదించింది.

నిషేధం కారణంగా రోజుకు రూ.3.5 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని, 250 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -