అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లు: ఈడబ్ల్యూఎస్ 10 శాతంలో 5 శాతం, దళిత క్రైస్తవలకూ రిజర్వేషన్లు..

ap assembly
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల ప్రవేశాల్లో.. కాపు, ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరికి 5 శాతం, ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో జనవరి 21న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కాపు, ఉప కులాలకు ఐదు శాతం, అగ్రకులాల్లో పేదలకు మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రూపొందించిన బిల్లును వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు శాసనసభ ముందుంచారు. విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా బిల్లును ప్రభుత్వం రూపొందించింది.  కాపు, ఉప కులాలకు ఒకటి, అగ్రకులాల్లో పేదల కోసం మరొకటి చొప్పున రెండు బిల్లులను మంత్రి ప్రవేశపెట్టారు.

శాసనసభలో వివిధ అంశాలకు సంబంధించి ఐదు బిల్లులతోపాటు పలు పత్రాలను పలువురు మంత్రులు సభ ముందుంచారు. చిత్తూరు జిల్లాలో వెల్‌టెక్‌ విశ్వవిద్యాలయం, అనంతపురంజిల్లాలో భారతీయ ఇంజినీరింగ్‌ సైన్సు, సాంకేతికవిజ్ఞాన వినూత్నకల్పన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును, రాష్ట్రంలో ప్రపంచస్థాయి డిజిటల్‌ విద్యాబోధన కేంద్రం ఏర్పాటుకు మరో బిల్లును మంత్రి గంటా శ్రీనివాసరావు సభలో ప్రవేశపెట్టారు.

దళిత క్రైస్తవులకూ సమాన హోదా

క్రైస్తవ మతం స్వీకరించిన షెడ్యూల్డ్‌ కులాల వారికి… ఇతర ఎస్సీలతో సమాన హోదా, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

బౌద్ధ, సిక్కు మతాల్లో చేరిన షెడ్యూల్డ్‌ తరగతుల వారికి… రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు ఇస్తున్న రిజర్వేషన్లు, రక్షణ, సామాజిక ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను యథావిధిగా వర్తింపజేస్తున్నారని, క్రైస్తవ మతంలో చేరిన ఎస్సీలకు మాత్రం వాటిని నిరాకరించారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్ ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నాయకుడు, ప్రభుత్వ విప్‌ ఎంఎ షరీఫ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనమండలి ఛైర్మన్‌ పదవికి బుధవారం నామినేషన్లు స్వీకరించగా… షరీఫ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.

గురువారం ఉదయం షరీఫ్‌ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్ఎండి ఫరూక్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది.

- Advertisement -