నల్గొండ: జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు- బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఏడుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు.
బొలేరో వాహనం దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా చెన్నారం వద్ద టైరు పగిలిపోయింది.. దీంతో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరో వాహనంలోని ఏడుగురు మృతిచెందగా.. బస్సులో ఉన్న 15 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులంతా శేరిపల్లి గ్రామపంచాయతీకి చెందినవారిగా గుర్తించారు.
ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నాగార్జునసాగర్ హైవేపై నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్… గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదం: పెళ్లి రోజునే ఎస్ఐ మృతి
ఇది ఇలా ఉండగా, మంగళవారం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మధుసూదన్ మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సమీపంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన కోన మధుసూదన్(33) యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఎస్సైగా పని చేస్తున్నారు. మధుసూదన్ నడుపుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పెళ్లి రోజునే మధుసూన్ మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మధుసూదన్ భార్య రోదనలు అందర్నీ కంటతడి పెట్టించాయి. కాగా, పోలీసు అధికార లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు నిర్వహించారు.








