మహిళల టీ20 వరల్డ్ కప్: సెమీఫైనల్లో భారత్ ఓటమి, మిథాలీని పక్కన పెట్టడంపై నెటిజన్లు ఫైర్

harman-preet-kaur-mithali-raj-1
- Advertisement -

నార్త్‌ సాండ్‌ (అంటిగ్వా): మహిళా టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓటమిని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్ సేన ఇంగ్లండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే.

గ్రూప్‌ దశలో సెంచరీలతో చెలరేగిన భారత బ్యాట్స్‌ ఉమెన్‌ అసలు మ్యాచ్‌ వచ్చేసరికి చేతులెత్తేశారు. స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్‌(26)లు తప్ప అందరూ నిరాశపరిచారు. దీంతో భారత్ జట్టు 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇంగ్లండ్‌ అమీ జోన్స్‌ (53), నటాలీ సివర్‌ (51)లు అర్ధసెంచరీలతో 17.1 ఓవర్లలోనే తమ జట్టుకు విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్‌ ఆసాంతం పరిశీలిస్తే మిథాలీ రాజ్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు…

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్ వరకు వచ్చి భారత్ బొక్కబోర్లా పడటాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రూప్‌ దశలో తిరుగులేని విజయాలతో అభిమానులను ఊరించిన హర్మన్‌ సేన.. సెమీస్‌లో కనీస పోరాట పటిమను సైతం ​ప్రదర్శించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భారత జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. చెత్త కెప్టెన్సీతోనే మ్యాచ్‌ చేజారిందంటూ హర్మన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మిథాలీ’ని పక్కన పెట్టడం ఏంటి?

ఈ కీలక మ్యాచ్‌కు సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను పక్కన పెట్టడంపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ టోర్నీలో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టిన మిథాలీని సెమీ ఫైనల్లో ఆడించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

‘హర్మన్‌ ప్రీత్ దూకుడులో విరాట్ కోహ్లీని మించిపోయింది పో.. మిథాలీని పక్కనబెట్టడం అత్యంత చెత్త నిర్ణయం’ అని.. కనీసం ఈ మ్యాచ్‌ చూసైనా సీనియర్‌ క్రికెటర్ల అవసరం ఏంటో టీమ్ మేనేజ్‌మెంట్ గుర్తించాలని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

హర్మన్ ప్రీత్ సమర్థింపు…

అయితే భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ని సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడించకపోవడంపై స్పందిస్తూ.. ‘‘ కొన్నిసార్లు మా వ్యూహం ఫలిస్తోంది. మరికొన్నిసార్లు విఫలమవుతుంది. దీనికి పశ్చాతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో మా జట్టు ఆట పట్ల గర్వపడుతున్నాను..’’ అని పేర్కొంది.

అంతేకాదు, ‘‘యువ జట్టుగా ఇది మాకో గుణపాఠం. మేం మ్యాచ్‌ను 18 ఓవర్లు వరకు తీసుకొచ్చాం. మేం మానసికంగా మరింత ధృడపడాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో అనే దానిపై దృష్టి పెట్టుంటే.. ఇలాంటి మ్యాచ్‌లను సులువుగా మావైపు తిప్పుకునే వాళ్లం..’ అని హర్మన్  అభిప్రాయపడింది.

- Advertisement -