

బెంగుళూరు: రెండో టీ20లోనూ అదే ఫలితం. వేదిక మారినా, సారథి కోహ్లీ చెలరేగినా.. భారత్‌కు మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్(113నాటౌట్; 55బంతుల్లో 7×4, 9×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రెండో టీ20లోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-0తో కైవసం చేసుకున్నట్లయింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్(47; 26బంతుల్లో 3×4, 4×6) శుభారంభం ఇచ్చాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో అర్ధశతకం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఎనిమిదో ఓవర్‌లో కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో రిచర్డసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
మాక్స్‌వెల్ వీరవిహారం…
ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ధావన్(14), రిషభ్ పంత్(1) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యత కోహ్లీ(72నాటౌట్; 38బంతుల్లో 2×4, 6×6) తీసుకున్నాడు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ(40; 23బంతుల్లో 3×4, 3×6)తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ జోడీ వీలుచిక్కినప్పడల్లా బౌండరీలు బాదుతూ శతక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరూ రాణించడంతో భారత్ నిర్ణీత 20ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190పరుగులు చేసింది.
లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో ఓపెనర్ స్టెయినిస్(7) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే ఫించ్(8) కూడా వెంటనే వెనుదిరిగాడు. దీంతో 22పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మాక్స్‌వెల్ ఆదుకున్నాడు.
మరో ఓపెనర్ షార్ట్(40; 28బంతుల్లో 6×4)తో నిదానంగా లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చాడు. మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ దశలో బుమ్రా వేసిన 19ఓవర్ తొలి బంతికి సింగిల్ రాబట్టి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ హ్యాండ్స్‌కాంబ్(20నాటౌట్) కూడా రాణించడంతో భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి.. 19.4ఓవర్లలోనే ఛేదించింది. దీంతో టీ20 సిరీస్ 2-0తో ఆసీస్ కైవసం అయింది.








