అసలు రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి? ప్రియాంక ఏమంటున్నారు?

robert vadra case details
- Advertisement -

sonia-priyanka-robert-vadra-rahul-gandi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త.. రాబర్ట్ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. రెండ్రోజులుగా ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ ఈనెల 12న జైపూర్‌లోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు రాబర్ట్ వాద్రా హాజరుకావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి? ఆ కేసుల్లో ఆయన ఎదుర్కొంటోన్న ఆరోపణలేంటి? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా వ్యాపార లావాదేవీల్లో అవినీతికి పాల్పడినట్లయితే మరి ఇన్నాళ్లూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎందుకు ఊరుకున్నారు? మరికొద్ది రోజుల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉన్నట్లుండి వాద్రా వ్యవహారం ఎందుకు రచ్చకెక్కింది?

ఓ టీవీ చానల్ కథన ప్రకారం.. రాబర్ట్ వాద్రాపై బ్రిటన్‌లో ఆస్తుల కేసు, బికనీర్ భూముల కేసు, గుర్గావ్ భూముల కేసుతోపాటు యూపీఏ హయాంలో జరిగిన పెట్రోలియం ఒప్పందంలోనూ లంచాలు ముట్టాయని ఈడీ ఆరోపిస్తోంది. ఇవీ వివరాలు…

బ్రిటన్‌లో ఆస్తుల కేసు…

బ్రిటన్ రాజధాని లండన్‌లో.. 12, బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లో సుమారు రూ.17.77 కోట్లు (1.9 మిలియన్ పౌండ్లు) విలువైన ఆస్తి కొనుగోలులో మనీ లాండరింగ్ జరిగిందని, ఈ ఆస్తి రాబర్ట్ వాద్రాకు చెందినదేననేది ఈడీ ఆరోపణ.

అంతేకాదు, బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లో‌లోని భవనంతోపాటుగా సుమారు రూ.37.42 కోట్లు విలువైన మరో రెండు ఆస్తులు కూడా ఆయనకు ఉన్నాయని, అలాగే రూ.46.77 కోట్లు విలువ చేసే మరో రెండు ఆస్తులు కూడా వాద్రాకు ఉన్నాయని, మొత్తంగా రాబర్ట్ వాద్రాకు 6 భవనాలు ఉన్నయని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ భవనాలన్నీ కలుపుకొంటే మొత్తం రూ.100 కోట్లకుపైగానే వాద్రా ఆస్తులు పలుకుతున్నాయని, వీటన్నింటినీ 2005 నుంచి 2010 మధ్యలో ఆయన బినామీ పేర్లతో కొనుగోలు చేశారని వాదిస్తోంది.

బికనీర్ భూముల కేసు ఏమిటంటే…

రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలో ఉన్న కొలాయట్‌లో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలోనూ మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ ఆరోపణ. ఈ భూములన్నీ కూడా పేద గ్రామాల పునరావాసానికి సంబంధించినవి ఈ వ్యవహారంపై 2015 సెప్టెంబర్‌లో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

సుమారు 173 ఎకరాల భూమిని రూ.72 లక్షలకే కొని.. ఆ తరువాత అక్రమ లావాదేవీల ద్వారా వాటిని రూ.5.15 కోట్లకు అల్లెగెన్సీ ఫిన్‌లీజ్ అనే సంస్థకు అమ్మేశారనేది ఈడీ వాదన. అంతేకాదు, అసలు ఈ సంస్థకు ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు లేవని, ఇదొక షెల్ కంపెనీ అయి తమ విచారణలో తేలిందని ఈడీ అధికారులు చెబుతున్నారు.

గుర్గావ్ భూముల కేసు…

హర్యానాలోని గుర్గావ్‌లో జరిగిన భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో 2018 సెప్టెంబర్‌లో హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, రాబర్ట్ వాద్రాలపై కేసు నమోదైంది. షికొపూర్ గ్రామంలోని 3.5 ఎకరాల భూమిని రాబర్ట్ వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ కొనుగోలు చేసి వాస్తవ ధరకంటే అధిక మొత్తానికి డీఎల్ఎఫ్ సంస్థకు విక్రయించిందనేది ఈడీ ఆరోపణ.

పెట్రోలియం ఒప్పందంలో అవినీతి…

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన పెట్రోలియం, రక్షణ ఒప్పందాల ద్వారా సోనియాగాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రాకు ముడుపులు అందాయని, ఆ డబ్బుతోనే ఆయన లండన్‌లో రూ.కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) ప్రభుత్వ హయాంలో 2009లో ఈ ఒప్పందాలు జరిగాయి.

ఇది నిజమేనని, ఈ ఒప్పందాల ద్వారా అందిన డబ్బుతోనే రాబర్ట్ వాద్రా లండన్‌లో ఆస్తులు కొన్నారని, ఈ విషయం తమ ప్రాథమిక విచారణలో తేలిందని కూడా ఈడీ ఆరోపిస్తోంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని శాన్‌టెక్ ఇంటర్నేషనల్ కంపెనీకి ఈ నిధులు వెళ్లాయని, తర్వాత ఈ కంపెనీ లండన్ బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లోని బంగళాను వర్టెక్స్ అనే ఒక ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు చేసిందని, ఆ తరువాత వర్టెక్స్ షేర్లు విదేశాల్లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త సీ తంపి నేతృత్వం వహిస్తోన్న స్కైలైట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు బదిలీ అయ్యాయని.. ఈ మొత్తం వ్యవహారం మనీ లాండరింగ్ కిందికి వస్తుందని ఈడీ వాదిస్తోంది.

రాబర్ట్ వాద్రాకు చెందిన సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీలో ఉద్యోగి అయిన మనోజ్ అరోరాను గత డిసెంబరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. మరో కేసులో ఆదాయపు పన్ను శాఖ కూడా మనోజ్ అక్రమ నగదు చలామణీకి పాల్పడినట్లు గుర్తించింది. ఇదంతా ఇప్పటికే పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి సంబంధించిన కేసు దర్యాప్తులో వెలుగు చూసిందని ఈడీ పేర్కొంది.

ఇదే భండారీ లండన్‌లోని బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌ భవనాన్ని రూ.17.62 కోట్లు పెట్టి కొన్నారని, మళ్లీ రూ.61 లక్షలు ఖర్చుపెట్టి ఆ భవనంలో అదనపు సౌకర్యాలు కల్పించారని, అంతేకాకుండా మనోజ్ అరోరా పేరిట ఒక్కోటి రూ.37 కోట్లు విలువ చేసే రెండు ఇళ్లు, నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, ఒక కంపెనీలో ఉద్యోగికి ఈ స్థాయిలో ఆస్తులు ఉండడమేమిటని ప్రశ్నిస్తోంది.

నిజానికి మనోజ్, భండారీలు బినామీలని, ఈ ఆస్తుల అసలు యజమాని రాబర్ట్ వాద్రా అని ఈడీ వాదిస్తోంది.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే…

తన భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ విచారించడంపై ఆయన భార్య, ప్రస్తుత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందిస్తూ… బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ దర్యాప్తు ఎందుకు జరుపుతోందో అందరికీ తెలిసిందేనని, తాజాగా ఏం జరుగుతోందో ప్రపంచం మొత్తానికి తెలుసునని విలేకరులతో వ్యాఖ్యానించారు.

మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ఘటనలకు పాల్పడడం అందరూ ఊహించినదేనని వ్యాఖ్యానించారు. ఈ విచారణలన్నీ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేయడానికే తప్ప మరోదానికి కాదని, కానీ ప్రజలు అంత తెలివితక్కువ వాళ్లేమీ కాదని ఆయన అభిప్రయపడ్డారు.

- Advertisement -